పుట:2015.373190.Athma-Charitramu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. స్నేహసహవాసములు 31

భాషణ మతిశయోక్తులతోఁ గూడియును, మొత్తముమీఁద జ్ఞానదాయకముగను సంతోషకరముగను నుండెడిది.

నా రెండవమిత్రుఁడు బంధకవి వెంకటరావు. రాజమంద్రిలో మొదటినుండియు నా కితఁడు సహాధ్యాయుఁడు. పరిస్థితుల వైపరీత్యమున నితఁ డిటీవల విద్యాభ్యాసమున నంతగ శ్రద్ధ వహింపకుండినను, తరగతిలోఁ దెలివిగలవారలలో నొకఁడు. నాతోఁ జెలిమిచేసి చదివినచో, తన కడగండ్లు కొంత మఱచిపోయి, తాను పరీక్షలో సులభముగ జయ మందఁగల నని యాతనియాశయము. అందువలన నీతఁడు నేనును మా యింటికిఁ జేరువ నొకగది పుచ్చుకొని, ప్రవేశపరీక్ష తరగతిలోఁ గొంతకాలము చదివితిమి. ఆసంవత్సరము వెంకటరావు పరీక్షలోఁ దప్పిపోయినను, నన్నుఁ బలుమారు గలిసికొనుచు, నాతో సుఖసంభాషణములు సలుపుచుండువాఁడు.

ఈ యిరువురు మిత్రులును నాకంటె వయస్సునఁ గొంత పెద్దలై, ఎక్కువ లోకానుభవము సంపాదించినవారలు. అంతకంతకు వారలను నేనును, నన్ను వారును విడువనొల్లని ప్రాణమిత్రులమైతిమి. వారలలో నొకరి కొకరికి మాత్రము సరిపడియెడిది కాదు! నన్నుగుఱించి వా రేకసమయమున వచ్చి యొకరి నొకరు కలిసికొనినపుడు, ఒకరి కొకరు ప్రేమభావము చూపక, వట్టి ముఖపరిచితులుగ మాత్రమే మెలంగుచువచ్చిరి ! ఇంతియ కాదు. నేను మూర్ఖుఁడనై, కన్నులు మూసికొని, వారలలో నొకని సహవాసము చేయుచుంటి నని రెండవవాఁడు కొన్ని సమయముల నన్నుఁ బరియాచకము చేయుచుండును ! స్థిరచిత్తుఁడు గాఁడనియు, నియమదూరుఁ డనియు నొకనినిగుఱించి యొకఁడు మొఱ పెట్టుచుండువాఁడు ! ఐనను నేను వారిలో నెవ్వనిఁగాని రెండవవానియొద్ద నిందింపక,