పుట:2015.373190.Athma-Charitramu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 32

నా మిత్రు లిద్దఱును సజ్జనులే యని నమ్ముచుండువాఁడను. నిజమునకు, మేము మువ్వురమును ఉదారాశయములతో నొప్పియుండియు, అనుభవలేశము లేని వట్టి విద్యార్థులమె ! మాలో నెవ్వనికిఁ గాని యింకను శీలబలము, చిత్తస్థైర్యము నేర్పడలేదు. ఐనను, కొలఁదికాలములోనే, పరిస్థితులప్రభావమున, మాయభిప్రాయము లందును, నీతినియమాదులందును గొంత దృఢత్వ మేర్పడెను. ఈసంగతి ముందలి ప్రకరణముల యందుఁ దేటపడఁగలదు.

9. కళాశాలలో ప్రథమవత్సరము

1887 వ సంవత్సరము జనవరినెలలో నేను రాజమంద్రియందలి ప్రభుత్వకళాశాలలో ప్రథమశాస్త్ర పరీక్షతరగతిలోఁ బ్రవేశించితిని. నా సహపాఠి ముఖ్యప్రాణరావు నేనును ఆమండలమున ప్రవేశ పరీక్షలో నుత్తీర్ణు లైనవారిలో ప్రథమతరగతియం దుండుటచేత, మా కిరువురకును విద్యార్థివేతన మీయఁబడెను. ముఖ్యప్రాణరావు కడచిన నాలుగు సంవత్సరముల నుండియు, మాపాఠశాలలోనే నా సహాధ్యాయుఁడు. ఆతనినమ్రతను, కుశాగ్రబుద్ధిని మెచ్చనివారు లేరు. విద్యాభ్యాసమే జీవితనియమముగఁ గైకొనిన విద్యార్థి యాతఁడు. పాఠము చదువక యాతఁడు బడికి వచ్చినరోజు గాని, అపజయమందిన పరీక్ష గాని, లేదనియె చెప్పవచ్చును. ఆతని జ్ఞాపకశక్తి యత్యద్భుతము. ఒకసారి చదివినతోడనే యాతని కెంత కఠినపాఠమైనను ముఖస్థమయ్యెడిది. కావుననే యతఁడు ప్రతితరగతియందును, ప్రతిపరీక్షయందును, ప్రథమస్థాన మలంకరించి యుండెడివాఁడు. అతనిని విద్యావిషయమున మించుట యటుండఁగా, సమీపించుట కైన నేసహపాఠికిని వలను గాకుండెను. ఆసంవత్సరము రాజమంద్రిలో ప్రవేశపరీక్ష