పుట:2015.373190.Athma-Charitramu.pdf/594

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 552

నెల్లూరు రమ్మని యాకళాశాలకార్యదర్శి నన్నుఁ గోరిరి. గుంటూరి కళాశాలాధ్యక్షులు నాకోరికమీఁద సెలవులలోనె సంతోషపూర్వకముగ నాకు వీడుకో లొసంగిరి. అంత 30 వ మేయి తేదీని నేను గుంటూరునుండి బయలుదేఱితిని.

1920 సం. జూను మొదటి తేదీని నేను నా నెల్లూరి యుద్యోగమునఁ బ్రవేశించితిని. ఈజూను నెలలోనె కళాశాల నెలకొల్పుటకు వలయుపను లెన్నియో నేను చేయింపవలసివచ్చెను. కావున కళాశాలకు సమీపముననుండు నొక గృహమును బుచ్చుకొని మరల గుంటూరు వెళ్లి, వస్తువులు సరదుకొని, ధర్మగృహనిర్మాణకార్యము పాలపర్తి నరసింహముగారి కొప్పగించి, 9 వ జూనున సకుటుంబముగ నెల్లూరికిఁ బయనమైతిని. మేము నెల్లూరిలో బసచేసిన యిల్లు దండువారి వీధిలోని మహదేవమొదలియారుగారి మేడ. ఆయనయు, వారిభార్య ఉన్నామలమ్మగారును సజ్జనులె, సాత్త్విక స్వభావులును. నెల్లూరిలో నివసించినంతకాలమును మేము వారి యింటనే విడిసియుంటిమి. ఆయిల్లు చిరకాలముక్రిందటఁ గట్టఁబడినను, బలిష్ఠముగను 'నాళ్ల' నడుమను నుండుటచేత, చోరభయ మెఱుఁగక, మే మందు శాంతచిత్తమునఁ గాలము గడపితిమి.

కళాశాలకుఁ గావలసిన సామానులన్నియు నేనిపుడు చేయించితిని. పుస్తకములు సమకూర్చితిని. భాండాగారమునకు కొనిన పుస్తకములు బీరువాలలో సరదించితిని. రాజాగారి పాఠశాలాభవనమున దక్షిణమువైపున నున్న మేడలో కళాశాలతరగతులు కూర్చుండుట కిర వేర్పఱిచితిమి.

జులై 2 వ తేదీని శ్రీవెంకటగిరి మహారాజాగారు కళాశాల తరగతికి ప్రారంభోత్సవము జరిపిరి.