పుట:2015.373190.Athma-Charitramu.pdf/593

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23. నెల్లూరు కళాశాల 551

గాని, నాకుఁగాని యీయుద్యోగము లభింపవచ్చునని తెలిసెను. నా పూర్వసహపాఠియగు నయ్యంగారు అనుభవశాలులగు ప్రతిభావంతులె కాని, యాయన యమ్. యె. పరీక్ష నీయకుండుటయు, కళాశాలలోఁ దగినంత నవీనానుభవము లేకుండుటయు వారొలోపములుగ నెన్నఁబడియెను. వీరియందుఁ గొందఱు సభ్యులకు సదభిప్రాయము లేదనికూడఁ దెలిసెను. ఐనను, నెల్లూరిలో నిల్లు కట్టి చిరకాల మచటనె నివసించిన యయ్యంగారికె యీ యుద్యోగము కావచ్చునని నే ననుకొంటిని.

ఇంతలో వేసవిసెలవులకు మేము భీమవరము వెడలిపోయితిమి. మాతమ్ముఁడు వెంకటరామయ్య కొమార్తె సీతమ్మ కపుడు వివాహము జరిగెను. ఏలూరునివాసియు, పట్టపరీక్షలో జయమందిన యువకుఁడునగు బొమ్మిరెడ్డిపల్లి రాజగోపాలరావు వరుఁడు. నెల్లూరి యుద్యోగము నాకు లభించెనని పెండ్లిమూఁడవనాఁడు నాకు తంతి వచ్చెను. ఈ సంతోషవార్త వివాహసందర్భమందలి మాయానందము నినుమడింపఁజేసెను. పెండ్లి ముగిసినవెంటనే మేము గుంటూరు తిరిగి వచ్చితిమి. స్థిరమగు గుంటూరి కళాశాలలో నున్నతపదవి నంద, యిటీవలనే యిట స్థిరనివాస మేర్పఱుచుకొనిన నేను, అంత సుస్థిరము కాని నూతనోద్యోగమున కంజవేయుట యసమంజస మేమో యని సందియ మందితిని. కనీసము కొన్నివత్సరములైన నాకీనెల్లూరియందలి నూతనోద్యోగము స్థిరమని వాగ్దానము వడయుఁడని మిత్రులు కొందఱనిరి. కాని, యిట్టి నూతనసంస్థల స్థిరత్వమును గూర్చి యెవరు బాధ్యత వహింతురు? స్వయంకృషిమీఁదను, కరుణానిధియగు దేవదేవుని యనుగ్రహముమీఁదను భారము వైచి, నేనీ నూతనోద్యోగస్వీకారము చేసితిని. జూను నెలారంభముననె