పుట:2015.373190.Athma-Charitramu.pdf/595

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23. నెల్లూరు కళాశాల 553

రాజాగారి పాఠశాలలో ప్రథమోపాధ్యాయులగు సంతానరామయ్యంగారు తమకుఁ గళాశాలధ్యక్షపదవి చేకూరకుండుట కాగ్రహించి, వేసవిసెలవులలోఁ దమపదవికి రాజీనామా నిచ్చిరి. నే నీ కళాశాల ప్రవేశించినతోడనె నా పూర్వమిత్రులు, ననుభవశాలులునగు నయ్యంగా రిటు లావిద్యాశాలను విడనాడుట నాకు బొత్తిగ నిష్టములేదు. తమ రాజీనామాను ఉపసంహరింపుఁడని అయ్యంగారికి నేను హితోపదేశము చేసితిని. కళాశాలాపరిపాలక వర్గములో నధ్యక్షునికివలెనే తనకును స్థాన మిచ్చి, పాఠశాలశాఖాపరిపాలనమునఁ దనకు సర్వాధికార మొసఁగినచో, తాను పాఠశాలను విడువనని యయ్యంగా రంత చెప్పిరి. నాయోజనమీఁద వారికోరికను పాలకవర్గమువారు మన్నించిరి. కావున సంతానరామయ్యంగారు పాఠశాలలోనే యుండిరి.

1920 జులై నెల యారంభమునుండియు కళాశాల తరగతిలోనిపని సక్రమముగ జరుగుచువచ్చెను. ఆ సంవత్సరము నందు పదునెనమండ్రు విద్యార్థులుండిరి. ప్రకృతిశాస్త్రముబోధింప మేము పూనుకొనలేదు. కావున, విద్యార్థు లందఱును మూఁడవ శాఖలోనే చేరి చదివిరి. కళాశాల కిపుడు నాతో నలుగురె యుపన్యాసకులు. కాజ శివరామకృష్ణారావుగారు చరిత్రయు, రాఘవన్ గారు తర్కమును, దుర్భా సుబ్రహ్మణ్యశర్మగారు తెలుఁగును, నేను ఆంగ్లమును బోధించుచుంటిమి. మొదటి సంవత్సరమున నంతగఁ బని లేకుండుటచేత, ఇంగ్లీషున నాకు శివరాకృష్ణారావుగారు సాయము చేయుచువచ్చిరి.

నాతమ్ముఁడు వెంకటరామయ్యపెద్దకుమారుఁడు నరసింహమూర్తి నెల్లూరు వచ్చి మావిద్యాశాలలో ప్రవేశపరీక్షతరగతిలోఁ