పుట:2015.373190.Athma-Charitramu.pdf/584

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 540

జరిగెను. గ్రంథాలయసభలో, గ్రంథాలయోద్యమమును గుఱించి యధ్యక్షకోపన్యాసము జదివితిని. సాంఘికసభలో స్త్రీవిద్యను గూర్చి తీర్మానమును నేను బ్రతిపాదించితిని. అచట నెలకొల్పఁబడిన "మండల సంఘ సంస్కరణ సమాజము" నకు న న్నధ్యక్షుని గను, న్యాపతి నారాయణరావుగారిని కార్యదర్శిగను నెన్ను కొనిరి.

నేను గుంటూరుచేరిన మఱునాఁడే (20 వ జూన్) మాపిల్లవాని స్మారకదినము ! అకాలమరణ మందిన యర్భకునిమృతికై నేను విలపించితిని. నాదు:ఖమునకు మేరలేకుండెను. నాఁడే మామఱఁదలు లక్ష్మమ్మ చిన్న కొమరిత చనిపోయెనను దు:ఖవార్త తెలిసెను.

ఈ సంవత్సరము వేసవియందుకూడ గోదావరీమండల సంచారము మానుకొని, మేము గుంటూరియందే నివసించితిమి. సూర్యనారాయణ ప్రథమశాస్త్రపరీక్షయందు జయమంది, ఉన్నతవిద్యకై రాజమంద్రి వెడలిపోయెను. మాబావమఱఁది వెంకటరత్న మిపుడు స్వల్పమగు నుపకారవేతనముమీఁద నుద్యోగము చాలించుకొనెను.

21. గృహశంకుస్థాపనము

పాపము బంగారయ్య తనవిద్యనుగుఱించి చేసిన చిల్లరయప్పు లింకను తీఱనెలేదు ! గుంటూరిలో వెంకటప్పయ్యగారికిని, మఱికొందఱికి నాతఁడు కొంత బాకీపడియుండెను. అతని బావమఱఁది నాకుఁ గొంత సొమ్మంపఁగా, ఋణదాతలతో నేను మాటాడి, వారిబాకీసొమ్ము తగ్గించి పుచ్చుకొనునటు లొడఁబఱిచితిని. అల్పజ్ఞులకు మర్త్యుల మనోరథములిట్లె సఫలమగుచుండును !