పుట:2015.373190.Athma-Charitramu.pdf/585

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21. గృహ శంకుస్థాపనము 541

ఆగష్టునెల మధ్య ప్రత్యేకాంధ్ర రాష్ట్రీయసభలు గుంటూరు పురమున జరిగెను. ఉత్సాహపూరితుఁడనై కొన్నిసభలకు నేను బోయితిని. ఆదినములందు గుంటూరునందు విషజ్వరములు ప్రకోపించి యుండెను. 22 వ తేదీని నేనును మఱునాఁడు భార్యయు, పిమ్మట నరసింహ రామచంద్రులును, జ్వరపీడితుల మైతిమి. ఇంట మేము నలుగురమును మంచ మెక్కి యుండునప్పుడు, పేదయవ్వ యొకతె వంట చేసిపెట్టి, మాకు సాయముచేసెను. 25 వ తేదీని మాతమ్ముఁడు వెంకటరామయ్య గుంటూరు వచ్చి మమ్ముఁ జూచి పోయెను.

సెప్టెంబరు 8 వ తేదీని జరిగిన మాయత్తగారి సాంవత్సరిఁక సందర్భమున వెలిచేరులో బంధువులు సమావేశమైరి. నేను నచటికి బోయితిని. ఆసమయమున మామఱఁదలు చామాలమ్మయు, ఆమె యిద్దఱు కూఁతులును విషజ్వరమునకు లోనయిరి, మాబావమఱఁది వెంకటరత్న మిపుడు కడియము ఠాణాదారుగ నుండెను. ఒక డింగీ కుదిర్చి, అతనికుటుంబమును సామానులను మేము వెంటఁగొని, 12 వ తేదీని కడియము చేరితిమి. 14 వ తేదీని నేను వెంకటరత్నమును రాజమంద్రివెళ్లి, ఆనందాశ్రమమున వీరేశలింగము గారి దర్శనముఁ జేసితిమి. ఆయన యారోగ్యవంతులుగనే యుండిరి. మఱునాఁడు నేను గుంటూరు వచ్చితిని.

అక్టోబరు మొదటిభాగమున, ఇరుగుపొరుగున నుండు స్నేహితులకుఁ గష్టములు సంభవించెను. ఉన్నవ లక్ష్మీనారాయణగారి భార్య లక్ష్మీబాయమ్మగారికి మూర్ఛలు వచ్చుచుండెను. వైద్యులు రాఘావాచార్యులుగారిని బిలిపించితిమి. కొలఁది కాలమున కామెకు నెమ్మది గలిగెను. సత్తిరాజు కామేశ్వరరావుగారి భార్యయు