పుట:2015.373190.Athma-Charitramu.pdf/570

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 526

మొదటిమాఱు. విపత్తు సంభవించినప్పటినుండియు దేవునిమీఁద నేను సమ్మెకట్టియున్నాఁడను. ఈసంవత్సర కార్యక్రమమును విమర్శించుకొని, ఆర్థికజ్ఞానారోగ్యముల విషయమై నేను వెనుకటికంటె సుస్థితి నున్నను, నైతికాత్మీయ విషయములం దభివృద్ధి గాంచనట్టుగఁ దెలిసికొన్నాను. ఈసంవత్సరమున జీవితమున నెపుడు నెఱుఁగని విధమున నామనస్సు సంక్షోభించెను. గత జూను నెలలో సంభవించిన మాపిల్ల వాని మృత్యువు సంసారజీవితమును నాకు విషప్రాయముగఁ జేసి, దేవునికి నాకు నెడఁబాటు గావించెను. ఈ విషమస్థితినుండి నన్నుఁ దప్పింపఁగలది మృత్యు వొకటియె."

మఱునాఁటి (1 - 1 - 1917) దినచర్యయం దిట్లు గలదు : - "ఈసంవత్సరాదిని గత యుగాదితోఁ బోల్చితిని. మా పిల్ల వాఁడు అపుడె పొంగుపడి నెమ్మదినందెను. అపుడు నాపరిచితులగు దొరలకు సంతోషమున క్రిస్మసు బహుమతు లంపితిని. ఇపుడొ నాకనుఁగవను గాఱు చీఁకటులు గప్పియున్నవి ! జీవితఫలము నాకేమియుఁ గానరా కున్నది. మృత్యువె నాకు దు:ఖోపశాంతి గావింపఁ గలదు. లాహూరు కళాశాలోద్యోగము వలదనుట పెద్దపొఱపాటె. అచటి కేగినచో నా కీపాటికిఁ గొంత యుపశమనము గలిగియుండెడిది....నేనీమధ్య చెన్నపురి కేగి, తనకు హితవు బోధించినందుకు, నా పూర్వ శిష్యుఁడు నన్నుదూఱి, నాకు చెడుగారోపించుచున్నాఁడు ! ఇతరుల తప్పు దిద్దఁజూచువారికి ప్రతిఫల మిదియె ! తన సతిని బరిత్యజించి, పరవనిత నింటఁ జేర్చినందు కాతని కనుతాపమె లేదు !"

నా ప్రాఁతదినచర్య పుస్తకములు తిరుగవేయుచుండుటవలన విచారభారము కొంత తొలఁగిపోవుచుండెడిది. భూతకాల విషయములను