పుట:2015.373190.Athma-Charitramu.pdf/571

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18. దు:ఖోపశమన ప్రయత్నములు (2) 527

దలపోయుచు, ఆ సుదినములందలి నాయాశలు, ఊహలును మననము చేసికొనుచు, వర్తమానమందలి విషాదముల నొక్కింత విస్మరించు చుండువాఁడను.

6 వ జనవరిని, ఇరుగుపొరుగులందు మృత్యుదేవత మాకుఁ బొడగట్టెను. చిరకాలమునుండి కొండ వెంకటప్పయ్యగారి యింట మిగుల నమ్మకముగనుండిన చెన్నకృష్ణమ్మయను వంటబ్రాహ్మణుఁడు, ఉత్తర హిందూదేశ మేగిన యజమానునిఁ గాంచ మిగులఁ బరితపించి, ప్రాణములు విడిచెను. మఱునాఁడే వెంకటప్పయ్యగా రిలుసేరి, ఇంతకాలమును దమకుఁ బరిచర్యలు సల్పిన సజ్జనునికిఁ దనకును తుదిచూపులు లేకపోవుటకు మిగుల విషాదమందిరి. గోవిందరాజుల శ్రీనివాసరావు గారి పెద్దకొమార్తె బాలప్రాయముననె హృద్రోగపీడితయై, వైద్యులు తన కేమియు నుపశమనము గావింపలేకపోవుటచేత, నారాయణ స్మరణము చేసికొనుచు, ప్రాణములు విడిచెను.

న్యాపతి హనుమంతరావుగారును, ఆయన యన్నయును తమ చెల్లెలిని జూచుటకై 1917 సం. జనవరి 11 వ తేదీని కాకినాడ బయలుదేఱఁగా, అచటనే యుండిన మాచెల్లెలిని జూచివచ్చుటకై నేనును వారితోఁ బయనమైతిని. మార్గమధ్యమున రాజమంద్రిలో న్యాపతి సుబ్బారావుపంతులుగారియింట మఱునాఁడు మేము నిలిచి, ఆరాత్రికి కాకినాడ చేరితిమి. మఱునాఁటి యుదయమున మాచెల్లెలిని జూచితిని. మాచిన్న చెల్లెలిని, దానిపిల్ల లను నిర్దయత్వమున మృత్యు దేవత నోట వైచుకొనిపోయినందుకు మేము విలపించితిమి. కాకినాడలో వెంకటరత్నమునాయఁడు, పెద్దంబరాజు, కొండయ్యశాస్త్రిగార్లు మున్నగు మిత్రులు, పిఠాపురము రాజాగారు జరుపుచుండెడి యనాథశరణాలయమును సందర్శించితిమి.