పుట:2015.373190.Athma-Charitramu.pdf/563

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17. దు:ఖోపశమన ప్రయత్నములు 519

కుని యాకారము బాహ్యప్రపంచమున రూపు మాసిపోయెడిదియె ! ఇపు డామిత్రుఁడు చేసిన సాయమునకు నే నమితకృతజ్ఞుఁడనై, యనుదినమును బాలకుని పటము చూచుకొని కాలక్షేపము చేయుచుంటిని. దీనివలన నా దు:ఖమునకు శమనోద్రేకములు రెండును గలుగుచు వచ్చెను.

మేము వెలిచేరులో నుండునపుడు మాతమ్ము లచటికి వచ్చి, మమ్మోదార్చిరి. తాను రాఁజాలనందుకుఁ జింతిల్లుచు, తన సంతాపము తెలుపుచు మా చెల్లెలు లేఖ వ్రాసెను. నా మేనమామలు మున్నగు బంధువులు సానుభూతిని దెలిపిరి. ప్రస్తుతము కన్నులకు మఱుఁగై యున్నను, కొన్ని దినములైన పిమ్మట పిల్లవాఁ డెచటి నుండియో తిరిగివచ్చు నని నేను భ్రమపడుచుండువాఁడను. ఇపు డేమిచేయుటకును, ఎచట నిలుచుటకును నాకుఁ దోఁపకుండెను. కావున నింకను సెలవుదినము లుండినను, మే మాయెండలలోనే గుంటూరు వెడలివచ్చితిమి. ఆ కష్టకాలమున మమ్ముఁ గనిపెట్టుటకై మాయత్తగారు మాతో వచ్చి గుంటూరిలోఁ గొన్నిదినము లుండిరి.

గుంటూరులో మేము నివసించు నింట నెచటఁ జూచినను, పిల్లవాని యాటవస్తువులె కానవచ్చెను. అవి కంటఁబడునపుడు, మాకు దు:ఖము పొంగి వచ్చుచుండెడిది. బాలకుని విహారమునకై నేను కలకత్తానుండి ప్రత్యేకముగఁ దెప్పించిన త్రోపుడు బండిని బాలరోగుల కుపయోగింపుఁ డని కుగ్లరు వైద్యాలయమునకుఁ బంపి వేసితిని. బాలకుని దుస్తులు నలంకారములును నాభార్య పరుల కిచ్చి వేసెను. కనుల కగపడకున్నను నా మనోనేత్రము ముందట మాపసివాని రూపము తాండవించుచునే యుండెను. ఇది కారణముగ నాకున్మాదము గలిగినఁ గలుగవచ్చు నని నే ననుకొంటిని.