పుట:2015.373190.Athma-Charitramu.pdf/564

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 520

నా కాసమయమున దు:ఖోపశమనము గావింపఁ బ్రయత్నించిన మిత్రులలో శ్రీ కొండ వెంకటప్పయ్య న్యాపతి హనుమంతరావు గార్లు ముఖ్యులు. పొరుగుననుండు వీరు సదా నాసేమము గనిపెట్టుచు, నా దృష్టిని దు:ఖవిషయమునుండి మరలింప నుద్యమించుచుండిరి.

కొలఁది దినములలో కళాశాల తీసిరి. నాయొద్దనుండి చదువుకొనుటకై మా పెద్ద మేనమామ రెండవకుమారుఁడు సూర్యనారాయణ వచ్చి, కళాశాలలో మొదటితరగతిలోఁ జేరెను. నాబావమఱఁది పెద్దకుమారుఁడు నరసింహము వచ్చి చిన్న పాఠశాల చేరెను. ఇపుడు విద్యాశాలలోని పనులవలన నాదు;ఖమునకుఁ గొంత విరామము గలిగెను. అనుదినము నొంటరిగఁ జాలదూరము నడచిపోయి ,ప్రకృతి దృశ్యములు చూచుచుఁ బ్రొద్దుపుచ్చు చుండువాఁడను. కాని, తప్పించుకొన నేనెన్ని యుపాయములు చేసినను, దు;ఖము నాహృదయమును జలగవలె నంటిపట్టియుండెను. మనస్సే దు;ఖవిషయము దెసకుఁ బరుగులెత్తునపుడు, విచారమును బాఱఁద్రోల నెట్లు సాధ్యమగును ? మనస్సున కేదేని వ్యాపృతి గలిపించుటకై, నాప్రాఁత దినచర్య పుస్తకములు నేను తిరుగవేయఁజొచ్చితిని. ఇది నెపముగా, బాల్యము నుండియు నేను వ్రాసియుంచిన దినచర్య పుస్తకము లామూలాగ్రముగ నే నాదినములలోఁ జదివి, మరల నేను భూతకాలమున జీవించునట్టుగ భ్రమించి దు:ఖపుఁబుట్టును గొంత సడలింప యత్నించితిని.

నా చెల్లెలియొక్కయు, దాని సంతతియొక్కయు మరణ విషయమును తేప తేపకు నాకు స్ఫురింపఁజేసి, జీవితమును దుర్భరముగఁ దోఁపించుచుండెడి యీ గుంటూరుపురమునుండి వెడలిపోయి, ఏ క్రొత్తదేశమునకైన నేగి, క్రొత్తయుద్యోగమునఁ బ్రవేశించినచోఁ నాకుఁ గొంత దు:ఖోపశమనముఁ గలుగవచ్చునని నమ్మితిని. అంతియ