పుట:2015.373190.Athma-Charitramu.pdf/547

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14. "చన్నపురి చక్షువులకు బంగాళాపద్ధతులు" 505

తన యున్నతవిద్యకుఁ దోడుగ బంగాళీకన్య, దేహసౌందర్యమును బెంపొందించు రహస్యముల నెఱింగియున్నది. కురులు దిద్దుకొనుట యందు బంగాళీసుందరి యసమాన దక్షిణాదితరుణులవలెఁగాక యిచటి పూబోణులు కేశములు వెనుకకు దువ్వుకొందురు. కొందఱి శిరోజములు వెనుకకు వ్రేలాడుచుండును. కొందఱికొప్పుల నిత్తడిదువ్వెన గూర్పఁబడి, కనకపుఁ గిరీటమువలెఁ గాంతు లీనుచుండును. మద్రాసు మగువలకంటె నిచటి సుదతలు సౌందర్యరహస్యమును బాగుగ గుర్తెఱిఁగి రనుట కొకగుర్తు, వీరంతగ నొడలిమీఁదను, కొప్పులోను నగ అలంకరించుకొనకపోవుటయె. ఇచట ప్రాచీనాచారము లనుసరింపని సుందరులు సామాన్యముగ నుదుట కాశ్మీరతిలక మిడరు. కొందఱి మేలిముసుఁగునఁ గొన్ని చిన్ని యాభరణములు మెఱయుచుండును.

పూర్వాచారపరాయణయగు బంగాళీభామిని బట్టకట్టు అంత బాగుగనుండదు. ఆమె ధరించు చిన్నచీరలోఁ జాలభాగము మేలి ముసుఁగునకె సరిపోవుటచేత, శరీరమునకు మంచి మఱుఁగు గలుగ కున్నది. ఇంక రవిక లేనెలేదు. కాని, నవనాగరకతచేఁ జెన్నొందు వంగవనితలు వన్నెవన్నెలవలువ లలంకరించుకొందురు. మద్రాసు ప్రాంతములందలి గొప్పయింటి క్రైస్తవకాంతలు వేసికొనునట్లు వీరి దుస్తులు ధరింతురు. కాని, యచ్చటి చానలకు చీరల సొగసు బాగుగఁ దెలిసియున్నది కాన, విదేశపు లంగాలకుఁగల వికృతరూపమును వీరు చక్కఁగ సరది, మఱి వానిని గుట్టుచున్నారు. రంగు గుడ్డలు, మజ్లిసు పట్టువస్త్రములును వీరు ఉపయోగింతురు. తమ చీరకొనలకు చిన్న నగలు సింగారించుకొందురు.

1914 వ సంవత్సరారంభమున కలకత్తా నగరమున జరిగిన బ్రాహ్మసమాజమువారి వివిధశాఖల మాఘోత్సవ వార్షికసభలు నేను