పుట:2015.373190.Athma-Charitramu.pdf/546

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 504

దక్షిణాదివారికిని బంగాళావారికిని జాల భేదము గలదు. దక్షిణదేశమునఁ బురుషులకు సామాన్యముగ జుట్టు బొట్టు లుండును. బంగాళా పురుషులలోమాత్ర మీ రెండు చిహ్నములును లోపించియుండును. దీనికిఁ గారణముగ నిచటివా రొక గాధ చెప్పుదురు. పూర్వ మొక మహమ్మదీయ ప్రభువు జుట్టుబొట్టులు గల హిందువులకు పన్ను గట్టఁగా, అవి రెండును దీసివైచి, జను లీ పన్ను నుండి సులభముగఁ దప్పించు కొనిరఁట ! కాళ్లకు బూట్సుజోడు, నిడుపగుదోవతి, కమ్మీజు, గడ్డము, కత్రింపు జుట్టు, ఇవియె బంగాళా బాబుయొక్క 'ముస్తాబు' !

1914 ఫిబ్రవరి 27 వ తేదీని నేను "బంగాళీపడతి" నిట్లు చిత్రించితిని. స్త్రీచక్షువులు స్త్రీ సౌందర్యమును బాగుగఁ బరిశీలించి విమర్శింపఁగలవు. నవభారత యువకుల హృదయములు చూఱకొను మహాసౌందర్యరాశి బంగాళీకామినియె యని నేఁ జెప్ప సాహసించువాఁడనుకాను. ఇతర రాష్ట్రీయాంగనలవలెనే బంగాళీ సుందరియు నుండును. రాణివాసమువలన బంగాళీ కన్యక యించుక పాలిపోయినట్టుగఁగూడఁ గానవచ్చును. ఈసుందరాంగులకుఁగల తను కాంతి, కనులతీరు, వదనలావణ్యమును, కావేరీ గోదావరీనదీతీరముల కమలాక్షులయందును, మలయాళపు మచ్చెకంటులయందును గాననగును. ఇట్లయ్యును, బంగాళీముదితలందు, తక్కిన వనితలయందుఁ గానరాని కొంత వింత సౌకుమార్యము గానఁబడియెడిని. జ్ఞానాధికత, భావ సంపద, ధారణాశక్తులతోఁ గూడుకొనిన సౌందర్య మామెది. బంగాళీయువతి లావణ్యమంతయు జ్ఞానసంబంధమగునదియె. వట్టి శరీర సౌకుమార్యమున చెన్నపురి చెలు లామెను మించిన మించవచ్చును.