పుట:2015.373190.Athma-Charitramu.pdf/533

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12. చెల్లెలి మరణము 491

చెల్లెలు కనకమ్మ, తనమువ్వురు పిల్లలతో, 23 వ తేదీని అత్తవారింటికి వెడలిపోయెను.

మేము పడరానిపాట్లుపడి పిల్లవానిని బెంచుచుంటిమి. రేయుంబవళ్లు పాలిచ్చుట కొక పాలదాదిని బెట్టితిమి. స్వతస్సిద్ధముగ బలహీనుఁ డగు పిల్లవాఁడు, పలుమాఱు వ్యాధిపీడితుఁ డగుచువచ్చెను. అందువలన మే మిరువురము నమితమగు నలజడికిఁ బాల్పడితిమి. 1912 ఫిబ్రవరి మార్చి నెలలో మరల శిశువునకు జబ్బుచేయుటచే, కుగ్లరు వైద్యాలయమునకు వానిని గొనిపోయితిమి. కుగ్లరుదొరసాని వాని రోగనివారణమును గుఱించి యెంతయో శ్రమపడెను. వ్యాధి నివారణము తన కిఁక సాధ్యము కాదని యామె యొకనాఁడు చెప్పివేయఁగా, మిత్రులయాలోచనలచొప్పున నాయుర్వేదవైద్యవేత్త రాఘవాచార్యులుగారిని దీసికొనిపోయి పిల్లవానిని జూపించితిమి. వైద్యము చేయుట కాయన యొప్పుకొనఁగా, పిల్లవాని నింటికిఁ గొనివచ్చితిమి. ఆయన మంచి మందిచ్చి యొకటి రెండు దినములలో నే జ్వరమును, వమనములను గట్టించెను. ఆయుర్వేదవైద్యమునం దిట్టి సూక్ష్మప్రక్రియ లుండుటకు డాక్టరు కుగ్లరు ఆశ్చర్యమందెను. పిల్లవానికిఁ గృత్రిమాహారము లెవ్వియు సరిపడ వనియు, తేప తేపకను మానిసిపాలు పితికించి పోయుఁ డనియును గ్రొత్తవైద్యుఁడు విధించుటచేత, రేయుంబవళ్లు మే మెంతయో శ్రమపడి శిశుపోషణము జరిపితిమి. అంతట పిల్ల వానికి నింపాదించెను.

ఆ వేసవి సెలవులలో పిల్ల వానిని జల్లగ నుండు నర్సాపురము కొనిపోవుద మను నుద్దేశముతో నేలూరువఱకును మేము వెళ్లి, అక్కడ మా తోడియల్లుఁడు వెంకటరత్నముగారియింట నొకటి రెండు దినములు నిలిచితిమి. ఇంతలో పిల్లవానికి మరల జబ్బు చేసెను.