పుట:2015.373190.Athma-Charitramu.pdf/508

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 466

సంధుఁడును, ఋషిసత్తముని బోలిన జితేంద్రియుఁడును, ఐనను, ఆయన న్యాయ మనుకొనిన పథమునుండి మనుష్యమాత్రు లెవరు నాయనను గదలుపలేరు.

ఇచటికి వచ్చునప్పటికి నాకు మరల ప్రార్థనసమాజాధ్వర్యము సిద్ధ మయ్యెను. నేను బూర్వము బెజవాడలో నుండునపుడు, కృష్ణా, మండల సభా సందర్భమున, వెంకటరత్నమునాయఁడుగారు, నేను మిత్రులును సంస్కృతపాఠశాలలో సమావేశమై నెలకొల్పిన సమాజమె యిపుడు దినదినాభివృద్ధి గాంచుచుండెను. శ్రీయుతులు చల్లా శేషగిరిరావు, చట్టి దుర్గయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణగార్లు దీని నిపుడు నడుపుచుండిరి. ఇపుడు నే నీబృందమునఁజేరి పనులు సాగించితిని.

8. జననీ సంస్మరణము

నేను గుంటూరు వచ్చిన కొలఁది దినములకే, మాతల్లికి వ్యాధి హెచ్చెనని తెలిసెను. ఆమెనిచటికిఁ దీసికొని వచ్చుట కేమియు వలను పడకుండెను. ఆమెవ్యాధి ప్రకోపించెనని నాకొకనాఁడు తంతిరాఁగా, సకుటుంబముగ నేను నరసాపురము పోయితిని. నంజు ముదిరినను, మాయమ్మ స్పృహతో నుండెను. ఇంతదూరమున నుండు నేను, అవసానసమయమునఁ దన్ను వీక్షింప వేగముగ వచ్చినందు కామె యమితసంతోష మందెను. అంతకంత కా మెవ్యాధి ప్రబలి, 1908 మార్చి 15 వ తేది రాత్రికి ధాతువు క్షీణించెను. చివరిని మేషమువఱకును స్పృహగలిగి, సంతానమందఱును తన్నుఁ బరివేష్టించియుండఁగా, వారినిఁ జూచి సంతోషించుచు, భగవన్నామ సంకీర్తనముఁ జేసికొనుచు, తెల్లవాఱునప్పటికి మాయమ్మ పరలోక ప్రాప్తిఁ జెందెను.