పుట:2015.373190.Athma-Charitramu.pdf/507

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. గుంటూరునందలి యుద్యోగము 465

నాయందు తమకు సదభిప్రాయము గలదనియు, నన్నున్నతదశకుఁ గొనివచ్చెద మనియు వారు చెప్పినను, నేను నా మనోనిశ్చయమును విడువలేదు. అందుచేత 1908 వ సంవత్సరారంభమున నేను విజయనగరము విడిచిపెట్టితిని.

నేను గుంటూరువచ్చు సరికి, నా బెజవాడ మిత్రుఁడును "దేశాభిమాని" పత్రికాధిపతియు నగు దేవగుప్తాపు శేషాచలపతిరావుగారు, క్రొత్తపేటలోఁ దమయింటికి సమీపముననుండు వేలమూరివారి యింటిలో నొకభాగమున నాకు బస కుదిర్చి యుంచిరి. గుంటూరు కళాశాలోపాధ్యాయులలోఁ గొందఱు నా కిదివఱకె స్నేహితులు. సుందరేశయ్యరు, కృష్ణమాచార్యులు, వెంకటరెడ్డిగార్లు నాకుఁ బరిచితులె. విజయనగరము వదలి గుంటూరు వచ్చుట, నాకు పరులయిల్లు వీడి స్వగృహమునఁ బ్రవేశించుటవలె నయ్యెను. ఇచ్చటి ప్రజలపద్ధతులు, ఆచారములు నాకుఁ జిరపరిచితములె.

కళాశాలయందలి పనియె నాకు మిగులఁ గష్టముగఁ దోఁచెను. ఇదివఱ కీపాఠశాల బోధకులగు నా పూర్వికుల పాపపుణ్యముల ఫలము నే ననుభవింపవలసి వచ్చెను. ఈవిద్యాశాలలో వెనుక వెంకటకృష్ణయ్యనాయఁడుగారిపని తెంపులేక యుండెను. కళాశాల తరగతులకు ఇంగ్లీషు, తెలుఁగు తర్జుమా, శారీరశాస్త్రము, ప్రాచీనదేశ చరిత్రమును, ప్రవేశతరగతిలో నింగ్లీషును, ఆయన చెప్పుచుండువారు. సంచితకర్మ సంచయమువలె నివియన్నియు నా మెడ కిపుడు చుట్టుకొనియెను. చరిత్రశాస్త్రమున పట్టపరీక్ష నిచ్చిన బోధకులు హిందువులలోను, క్రైస్తవులలోను పలువురున్నను, చరిత్ర మెఱుఁగని నేనే, కళాశాలతరగతుల కది బోధింపవలయును. దీనికిఁ గారణము నాపూర్వికుఁ డట్లు చేసెను. కళాశాలాధ్యక్షు లగు డాక్టరు ఊలుదొరగారు సత్య