పుట:2015.373190.Athma-Charitramu.pdf/506

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 464

వ్యుఁడు జొన్నవిత్తుల గురునాధముగారు నాతోఁ జెప్పి, విజయనగరమున దోమలబాధ యను నరకము ననుభవించెడివారికి గుంటూరు నివాసము స్వర్గలోక సదృశమని నుడివిరి. నే నంత గుంటూరు కళాలాధ్యక్షుఁ డగు డాక్టరు ఊలుదొరగారి కొక యర్జీనంపి, సిఫారసు చేయుఁడని నామిత్రులగు శ్రీ అనంతగారికి బెజవాడ వ్రాసితిని. కొద్ది రోజులలోనే నాకు జవాబు వచ్చెను. నాకు వెంకటకృష్ణయ్యనాయఁడుగారి యుద్యోగ మొసఁగెదమనియు, వారు చెప్పెడిపాఠము లన్నియు నేను జెప్పవలెననియు, జీతము 125 రూపాయిలు మాత్రమె యిచ్చెదమనియు వారు వ్రాసిరి. 1907 వ సంవత్సరము శీతకాలపు సెలవులలో నేనును మాతమ్ముఁడు వెంకటరామయ్యయును, చూచివచ్చుట కై గుంటూరువచ్చి, ఊలుదొరగారితో మాటాడితిమి. కళాశాలలో నాకు 130 రూపాయిల జీత మిచ్చుట కాయన యొప్పుకొనెను. ఆరోగ్యవిషయమున గుంటూరు చక్కగనుండినటుల మాకుఁదోఁచెను. ఇపుడు మాతల్లికి నంజువ్యాధి పొడసూపెను. నరసాపురము కాపురమువచ్చిన నాసోదరులయొద్ద నామె నివసించు చుండెను. మామాట యటుంచి, తల్లి యారోగ్యమును గుఱించి శ్రద్ధ వహించుట యిపుడు నాముఖ్యవిధిగఁ దోఁచెను. నంజువ్యాధిరోగులకు గుంటూరు మంచిది. మాతల్లిని గుంటూరు కొనివచ్చి యిచటామెకు దేహస్వాస్థ్యము గలిగించి, మేము హాయిగ నుండుట శ్రేయమని మాకుఁదోఁచెను. కావున నేను గుంటూరియుద్యోగము స్వీకరించితిని. ఈ సంగతి విజయనగరము కళాశాలాధ్యక్షునితోఁ జెప్పుటకు వారియింటి కేగితిని. నేను మొదటితరగతి కళాశాల విడిచి, రెండవతరగతి కళాశాలకు వెళ్లుటయు, దోమలకును బూరకాళ్లకును భయపడి విజయనగరము వదలివేయుటయు ఆయన కమితాశ్చర్యము గొలిపెను.