పుట:2015.373190.Athma-Charitramu.pdf/509

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. జననీ సంస్మరణము 467

మాజనని మరణమును గుఱించి నే నారోజులలో వ్రాసియుంచుకొనిన యాంగ్ల వ్యాసములోని ముఖ్యాంశము లిం దనువదించు చున్నాను : -

జీవితమునందువలెనే, మరణావస్థలోను, మాజనని వ్యక్తి విశేషమున నొప్పియుండెను. మాజనకునివలెఁ గాక యామె చివర నిమేషమువఱకును స్పృహతోనుండెను. ఇంతియకాదు. ప్రాణోత్క్రమణ సమయమున నాపుణ్యవతి శక్తియుక్తులు తీవ్రపటుత్వము దాల్చెను. తనజీవ మెగిరిపోవుచుండుట తెలిసియు, ఆమె యేమియు విచారము నొందదు. మరణవేదనలోఁ గొందఱు దైవమును దూఱెదరందురు. ఆమె యట్లు చేయలేదు. "నా కీవేదనను సంభవింపఁజేసిన దైవము, కావలసిన యోరిమికూడ ననుగ్రహించెనుసుమీ" అని నుడువునపుడు, ఆమెయాత్మ స్ఫటికాకృతిని దాల్చియుండెను.

మరణము తఱుముకొని వచ్చుచుండునపుడు, తనమంచము చుట్టును నిలుచుండిన కుమాళ్లను, కొమరితలను ఆపుణ్యవతి పలుమా రాత్రమునఁ దేఱిపాఱిచూచెను. సోగకనులా సుదతివదనమునకుఁ గాంతి నిచ్చుచుండెడివి. ఇపు డాముఖబింబము నంతటిని నిడుదకను లాక్రమించినట్లు తోఁచెను. దు:ఖపారవశ్య మందిన నే నామెశిరస్సును బట్టుకొని యుంటిని. స్వేచ్ఛయె యున్నచో, దు:ఖాతిరేకమున నేను నేలఁబడి పొరలెడివాఁడనే ! కాని, యాత్మనిగ్రహము దాల్పవలసిన సమయమిది. నే నామె తొలిచూలి బిడ్డను. ఈప్రాముఖ్యమునకు సదృశమగు బాధ్యతను మఱింత యోరిమితో నేను వహింపవలసి వచ్చెను. నేను దు:ఖానిష్ఠుఁడను కాఁగూడదు. మాతృప్రాణోత్క్రమణ పవిత్ర సమయమున చుట్టును శాంతినిగ్రహములు నెలకొల్పుభారము నామీఁద నున్నది.