పుట:2015.373190.Athma-Charitramu.pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. విజయనగర నివాసము 461

జేరువనే నివసించు చుండువారము. పాఠశాలా విషయములను గుఱించి మేము మాటాడుకొనువారము.

ఆకాలమున కళాశాలలోని నాలుగు తరగతులు చిన్నవిగ నుండుటచేత మేడమీఁద గదులలోఁ గూడెడివి. విద్యార్థులక్రీడలను గుఱించి రామానుజచార్యులవారు మిగుల శ్రద్ధవహించుచు వచ్చిరి. కళాశాల కంటి విశాలస్థలము లేకుండుటచేత, మైదానమందలి 'అయోధ్యకుఁబోయి, విద్యార్థులు క్రికెటు, కాలిబంతి మున్నగు నాటలాడు కొనుచుండిరి. అందఱి విద్యార్థులచేతను ఆటలాడింప నధ్యక్షులకోరిక. కావున వంతులచొప్పున సహాయోపన్యాసకులు మువ్వురును విద్యార్థుల యాటలు తనిఖీచేయుచుండవలెను. కొంతకాలమునకు విద్యార్థులచే ననుదినమును వినోద పుస్తకపఠనముచేయింప నధ్యక్షులకుఁ గుతూహలము గలిగెను. ఇది నాకును సమ్మతమే. విద్యార్థులను ఉపాధ్యాయుల గదులలోనే కూర్చుండఁబెట్టి, వారలచే నచటనే పుస్తకపఠనము చేయించుట యుక్తమని యధికారికిఁ దోఁచెను. కావున నీపనియు మామీఁదనె పడెను. అందువలన పనియెక్కువయై, అధ్యాపకులు విద్యార్థులును మూలుగసాగిరి. ఉపాధ్యాయుల నిర్బంధ సహవాస సాహాయ్యములు లేకయే, విద్యార్థులను వారిచదువు సాములు స్వేచ్ఛగ సాగించుకొననిచ్చినచో పరిస్థితులు బాగుపడునని యందఱు ననుకొనెడివారు. కాని, చదువు సాములు రెండింటిని విద్యార్థుల యిష్టమునకే వదలివేసినచో, వారవి బొత్తిగ వదలివేయుదురనియె యధ్యక్షులవారి భయము.