పుట:2015.373190.Athma-Charitramu.pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. పరిస్థితులలోని మార్పు 445

డవ నివేశనముకూడ నమ్మివేయుటకు మే మేర్పఱుచుకొంటిమి. మా తమ్ముఁడు రాజమంద్రినుండి సకుటుంబముగ భీమవరము వెళ్లుటకు సంసిద్ధమయ్యెను. ప్రథమశాస్త్రపరీక్షలో గెలుపొందినను లేకున్నను కృష్ణయ్య యుద్యోగమునఁ బ్రవేశింపవలసినదెయని నేను జెప్పివేసితిని. 1903 జనవరి 5 వ తేదీని పర్లాకిమిడికి బయలుదేఱితిని.

ఢిల్లీ దర్బారు సందర్శించి వచ్చిన పర్లాకిమిడి రాజావారికి సుస్వాగత మొసంగుటకు 7 వ జనవరిని ఉపాధ్యాయుల మందఱము రెయిలునొద్దకుఁ బోయితిమి. 10 వ జనవరిని కళాశాలాంధ్రోపధ్యాయులగు మత్స వెంకటకవిగారు కీర్తిశేషులైరి.

అంత మా వాండ్రు టెక్కలినుండి పర్లాకిమిడి వచ్చివేసిరి. పాండ్యాగారి మందువలన నాభార్య కేమియు లాభము గలుగలేదు.

మాకళాశాలలో ప్రథమశాస్త్ర పరీక్షకుఁ బోయిన 19 లోను 11 విద్యార్థులును, ప్రవేశపరీక్షలో 21 కి 12 విద్యార్థులును జయమందినట్లు తెలిసి మిగుల సంతోషించితిమి. మాతమ్ముఁడు రాజమంద్రిలోని రెండవస్థల యమ్మివేసి కొంతయప్పు తీర్చివేసెనని తెలియవచ్చెను. ఇంకను గొంతయప్పు మిగిలియేయుండెను. ఇది యెట్లు తీఱు నాయని యాలోచించితిమి. ప్రథమ శాస్త్రపరీక్షయందు కృష్ణయ్య జయమందుట సంతోషకరమగు వార్త. బి. ఏ. పరీక్షకు తాను జదివెదనని యాతఁడు వ్రాసెనుగాని, ఇంకఁ జదువు విరమించి, యుద్యోగ ప్రయత్నము చేయుమని నేను జెప్పితిని. బోధకవృత్తిలోఁ బ్రవేశించుటకై యాతఁ డంత రాజమంద్రిలోని బోధనాభ్యసనకళాశాలలోఁ జేరెను.

29 వ జనవరిని రాజాగారి చెల్లెలగు జలాంత్రరాణిగారు చనిపోయిరని తెలిసి విషాదమందితిమి. మఱునాఁడు ఉపాధ్యాయుల