పుట:2015.373190.Athma-Charitramu.pdf/486

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 444

నని యాయన వారించినందున నేనది పత్రిక కంపివైచితిని. "ప్రధానోపాధ్యాయుఁడు, ఆతని సహాయకులు" అను మకుటముతో నావ్యాసము "సంఘసంస్కారిణీ" పత్రికలో ముద్రితమయ్యెను. దానిలో వ్యక్తిదూషణము లెవ్వియును లేవు. అనేక పాఠశాలలందలి యుపాధ్యాయులలోఁ గక్షలుగలవనియు, సామాన్యముగ ప్రథానోపాధ్యాయుఁడు ఆతని సహాయకులును పరస్పర శత్రువులుగ నుందురనియును, ఇది విద్యాలయమందలి క్రమశిక్షణమునకును జ్ఞానప్రబోధమునకును భంగకరమనియును నాయభిప్రాయము. విద్యాలయములు శాంతినిలయములుగ నుండిననే, అచటివిద్యార్థులకు విద్యావినయము లబ్బును గాన, ప్రధానోపాధ్యాయుఁడు తన సహాయకులను స్నేహభావమునఁ జూడవలెననియు, ఉపాధ్యాయులలో సోదరసామరస్య మున్నఁగాని విద్యాసంస్థ యేదేశమునఁగాని జయప్రదముగ సాగదనియును నేను వ్రాసితిని.

1902 ఫిబ్రవరినుండియే నేను "హిందూసుందరీమణుల చరిత్రము"ల మూఁడవభాగ మారంభించితిని. దీనిలో మొదటికథ 'లీలావతి'. చివరదియగు 'విశాల' ఆ డిశంబరు సంచికలో వ్రాసి, మూఁడవ భాగమును ముగించితిని. పదునొకండు కథలున్న యీభాగము మొదటి రెండింటికంటెను మిగుల చిన్నది. ఇట్లు 1902 వ సంవత్సరాంతమునకు నాతెలుఁగుపుస్తకము లాఱును సిద్ధమయ్యెను. స్త్రీలకుఁ జదువుకొనుట కంతగ పుస్తకములు లేని యాకాలమున నీ పుస్తకములు స్త్రీలోకమున కత్యంతోపయుక్తములుగ నుండెడివి.

1902 వ సంవత్సరము డిశెంబరు సెలవులలో నేను రాజమంద్రివెళ్లి, మాతల్లిని, సోదరులను జూచితిని. మద్రాసునుండి మావావమఱఁది వెంకటరత్న మపుడేవచ్చెను. రాజమంద్రిలోని మారెం