పుట:2015.373190.Athma-Charitramu.pdf/485

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. పరిస్థితులలోని మార్పు 443

అనునొక యోడ్రవైద్యుఁడు రాజమంద్రిలోఁగలఁడు. అతఁడు మంచి సాధకుఁడని తెలిసెను. తమ్ముఁడు కృష్ణయ్య యాయన నిచటికిఁ గొని వచ్చెను. ఆయన మంచి నాడీనిదాన నెఱిఁగిన వైద్యుఁడు. జ్వరము దిగపోకుండినను రోగి కాహారమిచ్చుచుండవలెనని యాయన చెప్పి, గోధుమగంజి పోయించెను; మందు మార్చివైచెను. కొన్ని రోజులకు జ్వరము నిమ్మళించెను. అంత నచటినుండి మాచెల్లెలిని మేము రాజమంద్రి తీసికొనివచ్చితిమి. ఆవైద్యుని యౌషధములవలన నామెకు దేహమున నారోగ్యముగలిగి క్రమముగ బలముపట్టెను.

కొద్దినెలలక్రిందట మా రాజమంద్రినివేశన మొకటి యమ్మివైచితిమి. ఇపుడు రెండవదికూడ నమ్మఁజూపితిమి. నేనంత కాకినాడమీఁదుగ పర్లాకిమిడి వెడలితిని. మాయత్తగారు తమకూఁతును జూచివచ్చుటకై నాతో బయలుదేఱిరి. వైద్యుని సలహాననుసరించి, యౌషధసేవకై నాభార్యను 10 వ నవంబరున తల్లితో టెక్కలి పంపివేసితిని. నేను కళాశాలా భోజనవసతిగృహమున మరలఁ బ్రవేశించితిని. ఆరోజులలో మావిద్యాలయమును తనిఖీచేయవచ్చిన విలియమ్సుపిళ్ల గారు నాతరగతులు పరీక్షించి, నాపని మిగుల బాగుగ నుండెనని మెచ్చుకొనిరి. బెజవాడకంటె పర్లాకిమిడియు, అందలి పాఠశాలకంటె నిందలి విద్యాలయమును మంచిస్థితిలోనుండెనను వారి యభిప్రాయమున సత్యము లేకపోలేదు. ఈవిద్యాశాలలో విద్యార్థుల సంఖ్యయు, వారి పరిశ్రమాదులును చక్కఁగ నుండెను.

ఆసమయమున "లోపభూయిష్ఠుఁడగు ప్రధానోపాధ్యాయుఁడు" అను నాంగ్ల వ్యాసము నొకటి వ్రాసి, నేనది చదివెదననియు, సభకు వారు అధ్యక్షులుగ నుండవలెననియు, పిళ్ల గారిని నేను గోరితిని. నా యుపన్యాసము వ్యక్తిదూషణముల కెడమిచ్చునను నపోహలు గలుగు