పుట:2015.373190.Athma-Charitramu.pdf/488

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 446

మందఱమును కోటలోనికిఁబోయి, రాజాగారిని వారిసోదరుని బరామర్శించితిమి. మేము క్రిందనిలుచుండి, పాన్పుమీఁద నాసీనులగు రాజులను సందర్శించితిమి. వారు మౌనము వహించియుండిరి. వారికి సంభవించిన విపత్తును గుఱించి మాలోనొకరు ప్రస్తావింపఁగా, ఇంకొకరు ప్రత్యుత్తర మిచ్చుచువచ్చిరి. మాలోమాకే యీ సంభాషణ జరిగిన పిమ్మట, మేము సెలవు గైకొంటిమి. ఓడ్ర ప్రభువుల మరియాద లివియని నాకుఁ దెలిసెను. పిమ్మటఁ గొంతకాలమునకు యువరాజుగారు చనిపోయినప్పుడు, మే మిట్లే ప్రభుపరామర్శచేసి వచ్చితిమి. ఎవరుగాని యనుశ్రుతమగు నాచారము నతిక్రమింపఁ జాలరు !

నేను విద్యగఱపిన తరగతులు బహిరంగపరీక్షలలోను కళాశాలపరీక్షలలోను బాగుగ జయమందుటచేత, అచటి యేర్పాటు ననుసరించి, నాజీత మైదురూపాయిలు హెచ్చుచేయఁబడెను.

మాతమ్ముఁడు వెంకటరామయ్య కొలఁదికాలములోనే రాజమంద్రినుండి వెడలిపోవఁదలంచినందున, 1902 సెప్టెంబరునుండియె జనానా పత్రికకు నేనొక్కడనే సంపాదకుఁడగనుంటిని. నాకోరిక మీఁద పర్లాకిమిడి విద్యాలయమందలి బోధకులు కొందఱు నాపత్రికకు వ్యాసములు తఱచుగ వ్రాయుచుండువారు. వారిలో ముఖ్యులు ఇవటూరి కనకాచలముగారు.

4. సుఖదినములు

1903 వ సంవత్సరారంభమున మా తమ్ముఁడు వెంకటరామయ్య సకుటుంబముగ రాజమంద్రినుండి భీమవరము వెడలిపోయెను. అచట కొలఁదికాలము క్రిందటనే క్రొత్తగ మునసబు