పుట:2015.373190.Athma-Charitramu.pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42. "హిందూ సుందరీమణులు" 397

లిడినను, న్యాయసభలో సత్యము పలుకుట నీచమా యని యాశ్చర్య పడితిని.

వీరభద్రరావుగారు బెజవాడనుండి వెడలిపోయిన పిమ్మట, మాయింట నొక వైదిక బ్రాహ్మణ కుటుంబమును రెండవభాగమున నుంచితిమి. ఆ పెద్దయావరణమున మే మొంటరిగ మసలుటయు, ఆ చిన్న యింట మాతోఁగలసి వేఱొకరు కాఁపురము చేయుటయును గూడఁ గష్టమే !

నాకు గుండెదగ్గఱ మంట యనుదినమును గనఁబడుచుండెను. కోకో గాని తమిదయంబలి గాని పుచ్చుకొని చూడు మని వైద్యుఁడు చెప్పఁగా, నే నిట్లు చేసితిని గాని లాభము లేకపోయెను. పాఠశాలలో పని యెక్కువ యగుటయే దీనికిఁ గారణ మని నేను నమ్మితిని. ఇది యొకటియే గాక, పత్రికలకు వ్రాయుట, సభలు సమావేశములు సమకూర్చుట, గృహచ్ఛిద్రములను గుటుంబ ఋణములను గూర్చి సదా తలపోయుట, - మున్నగు పను లన్నిటివలనను నా దేహపటుత్వము తగ్గుటయే దీనికిఁ గారణము కావచ్చును.

నే నిపుడు "ఇంగ్లీషువారి సంసారపద్ధతులు" తెలుఁగుచేసి, యీ సంవత్సరము అక్టోబరునుండియు "జనానాపత్రిక" లోఁ బ్రచురింపసాగితిని. పత్రికలో వ్రాసినభాగముల ప్రతులు పుస్తకరూపమున ప్రత్యేకముగఁ గొన్ని తీయించుచు వచ్చితిని. ఈవిధముగ నాపుస్తకమంతయు 'జనానాపత్రిక' యెనిమిదవ సంపుటాంతమున, అనఁగా 1901 సం. జూనునెల పత్రిక సంచికతోఁ బూర్తిపఱిచితిని. తెలుఁగుపద్యములు వ్రాయు నభ్యాసము నాకు లేదు. కావున మాతృకలో నుల్లేఖింపఁబడిన టెన్నిసను మున్నగు నాంగ్లకవులపద్యముల