పుట:2015.373190.Athma-Charitramu.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 398

భావము నేను జెప్పఁగా, నామిత్రులు కామశాస్త్రిగారు చక్కని తెలుఁగు పద్యములు రచించి నా కిచ్చుచు వచ్చిరి. అవి నేను బుస్తకమునఁ జేర్చితిని.

43. చీఁకటివెన్నెలలు !

నేను మాతండ్రిగారి యాబ్దికమునకై అక్తోబరు చివరభాగమున రాజమంద్రి వెళ్లినపుడు, సంసారమును బెజవాడకుఁ దరలించుటను గుఱించి మా తమ్మునితో మరల ముచ్చటించితిని. అందఱము నొకచోటనె యుండినఁగాని మా రాబడి యెంత హెచ్చినను, మేము సొమ్ము కూడఁబెట్టలేమని గ్రహించితిమి కాని, మాచెల్లెలు కనకమ్మ పురుడు రెండునెలలలో రావచ్చును గావున, మావాండ్రు రాజమంద్రి యిపుడు విడుచుటకు వలనుపడకుండెను. అందుచేత వర్తమానమున మా సమష్టికాఁపురపు సంగతి కట్టిపెట్టితిమి.

30 వ అక్టోబరు వార్తాపత్రికలలో మోక్షమూలరు పండితుఁడు పరమపదముఁ జెందెనని యుండెను. ఆ మహామహుఁడు హిందూమతగ్రంథ ప్రచురణమునకై చేసిన యపార పరిశ్రమము కడు శ్లాఘనీయమైనది. ఆకాలమున దొరతనమువారు రాజమంద్రి కళాశాలను మూసివేతురనియును, ఒక క్రైస్తవ సంఘమువారు దానిని గైకొని నడుపుదు రనియును వదంతులు ప్రబలెను. ఇవి యందఱికిని విషాదమును గలిగించెను. అంతట ప్రభుత్వమువారు తమ మనస్సును మానుకొనినట్లు విని సంతోషించితిమి.

రచనావిషయమున నొకపనితో రెండుఫలితము లొనఁగూర్ప నేను బ్రయత్నించుచు వచ్చితిని. 11 వ నవంబరున నాగుండెమంట లొకింత చల్లార్చుకొనుటకో యనునట్టుగ, "వెన్నెల"ను గుఱించి