పుట:2015.373190.Athma-Charitramu.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 396

ధానియందు ఆస్తిక మతప్రచారకుఁడవు కమ్మని నాకు నిన్న కొందఱు మిత్రులు వ్రాసిరి. ఆహా, ఈ పదవికి నే నెంతయు ననర్హుఁడనుగఁదా ! పాపి యగువాఁడు తోడిపాపుల కెట్లు తోడునీడ కాఁగలఁడు ? నా కీగౌరవము ముమ్మాటికిని వలదు ! నాకు పాప మాలిన్యములయందే యనురక్తి !"

నా కీమధ్య లభించిన మార్టినో రచనములు నే నిపుడు తఱచుగఁ జదువుచుంటిని. అప్పుడప్పుడు ఆంధ్రసాహిత్య గ్రంథములు చదివి సతికి వినిపించి యర్థము చెప్పుచుండువాఁడను.

30 వ సెప్టెంబరు ఆదివారము మధ్యాహ్నమున నేను గదిలోఁ జదువుకొనుచుండఁగా పొరుగునుండి కేకలు వినఁబడెను. నేను వాకిటికి వచ్చి చూడఁగా, మా జామచెట్టుమూల నొక ముసలివాఁడు దాఁగి యుండెను. వానిచేతిలో కంచుగిన్నె యొకటి యుండెను ! నా ప్రశ్నలకు వాఁ డేమియు ప్రత్యుత్తర మీయక, దిగాలుపడి చూచెను. ఇంతలో జనులు మా యావరణములోనికి వచ్చి యామనుష్యునిఁ బట్టుకొనిరి. పాప యాముసలివాని మొగము కడుదీనముగ నుండెను. గిన్నె దొరకెను గాన, వానిని వదలివేయుఁ డని నే నంటిని. ప్రజలు వానిని బోనీయక పోలీసు స్టేషనుకుఁ గొనిపోయిరి. పిమ్మట నొకరక్షక భటుఁడు వచ్చి దండనాధిపు నెదుట నేను సాక్ష్య మీయవలయు నని చెప్పి, నా పేరు వ్రాసికొని పోయెను. మఱునాఁడు నేను న్యాయస్థానమునకుఁ బోయియుంటినిగాని, నాసాక్ష్యము గైకొనకయే యధికారి దొంగకు మూఁడు నెలల ఖైదుశిక్ష విధించెను. ఈచోరీ విషయమున నన్ను బో నెక్కించి నాచే సాక్ష్యము పుచ్చుకొని, నాకు శ్రమయు నవమానము గలిగింపఁ దాను సమ్మతింపకుంటి నని న్యాయాధికారి యనునప్పుడు, నేను మరియాద కాయనకు వందనము