పుట:2015.373190.Athma-Charitramu.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 380

11 వ తేదీని రాజమంద్రిలో జరిగిన ప్రథమవితంతువివాహము శ్రీకందుకూరి వీరేశలింగముపంతుల నామమునకు దేశవిఖ్యాతిని గలిగించెను. కారణము లేని కార్యమెన్నఁడును గలుగనేరదు. ప్రస్తుతమున నాంధ్రు లెంత హీనదశలో నున్నను, పూర్వకాలమున ప్రక్యాతిగనిన జాతియె వారిది. కృష్ణదేవరాయల కాలమున నాంధ్రరాజ్యము దక్షిణహిందూ దేశమంతటను వ్యాపించియుండెను. వారిభాష లాలిత్యనృదుత్వములకుఁ బర్యాయపదమయ్యెను. వారి కవితా సారస్వత మౌన్నత్యము దాల్చెను. అదివఱకె ఆంధ్రదేశమునకు రాజమహేంద్రవరము మధ్యస్థాన మయ్యెను. దక్షిణదేశవాహినులలో మిన్న యగు గోదావరినదీతీరమున నాపురము భాసిల్లుచుండెను. ఆపట్టణమున నన్నయభట్టు తన యాంధ్రభారతమును రచియించి, ఏలికయగు రాజనరేంద్రుని కంకిత మొనరించెను. ఆ ప్రాంతములందె ఆంధ్రకవిసార్వభౌముఁ డగు శ్రీనాథుఁడు గ్రుమ్మరుచుండువాఁడు.

వీరేశలింగకవి ఆంధ్రులలో నాంధ్రుఁడు. వీరిది విద్వద్వంశము. ప్రవేశపరీక్షవఱకె యీయన యాంగ్లవిద్య నేర్చియుండినను, ఆంగ్ల సారస్వత సారమును గ్రోలినవాఁడని చెప్పవచ్చును. విద్యాబోధకవృత్తి నవలంబించిన యీయువకుఁడు, స్త్రీ విద్యాభిమానియై బాలికాపాఠశాల నొకటి ధవళేశ్వరమున స్థాపించెను. పత్రికలకు వ్యాసములు వ్రాసి పంపుచు, పిదప 'వివేకవర్థని' యను పత్రికను నెలకొల్పెను. మొదట పద్యములు రచియించుటతోనె కాలము గడపినను, అంతకంత కీయన గద్యరచన మారంభించి, సంస్కరణ విషయములను జర్చింపసాగెను. వితంతూద్వాహములను ప్రోత్సహింప నొక సమాజమును స్థాపించి, అంత వీరేశలింగముపంతులు ఆసంస్కరణమును గుఱించి విజ్ఞాపనములు ప్రకటించెను. కార్యరూపము దాల్చినఁగాని యెట్టి సంస్కరణమునకును