పుట:2015.373190.Athma-Charitramu.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

39. "వీరసంస్కర్త" 379

సంఘసంస్కరణ విషయమునఁగూడ శూరులు గానవచ్చు చున్నారు. దేశీయుల దురభిమానదుర్భ్రమలను లెక్కసేయక, సంఘశరీరము నందలి దుష్టాంగమును ఖండించివైచు చికిత్సకుఁడై, వలసినయెడ తనసుఖమును తనయసువులను తాను బూనిన యుత్తమకార్య నిర్వహణమునకై యర్పణచేయువాఁడె శూరుఁడు. సంఘసంస్కర్త కార్యకలాపము సుఖశయ్య యని తలంపరాదు. దైవముపట్లను తోడిమానవులదెసను జెల్లింపవలసిన విధ్యుక్తములు చెల్లించుటతప్ప నన్యాపేక్షలతో సంస్కరణరంగము చొచ్చువాని కాశాభంగమె కలుగును.

కావున సంస్కర్తయు శూరుఁడె. ఎంత హీనస్థితియం దుండిన జాతిలోనైనను శుభోదయసమయమున సంస్కర్త పొడసూపు చుండును. పరదేశీయులచే జయింపఁబడిన భారతదేశము తరతరముల నుండి యంతశ్శత్రులదాడికిని లోనగుచువచ్చెను. నిరర్థకకర్మలకును, హేయదురాచారములకును భారతమాత దాస్యము చెల్లింపుచుండెను. అంత వంగదేశమున రామమోహనుఁ డుద్భవించి, సహగమననిరోధము గావించి, స్త్రీస్వాతంత్ర్యమునకు రాజమార్గ మేర్పఱిచెను. ఈశ్వర చంద్రవిద్యాసాగరుఁడు వితంతువివాహములు నెలకొల్పెను. బొంబాయి రాజధానిలో విష్ణుపండితుఁ డీసంస్కరణమునకు ప్రాచుర్యము గలిగించెను.

ఇంక మనరాజధానిమాట యేమని యెవరైన నడుగవచ్చును. విద్యాధికతా ధనసంపన్నతలు వెలసియుండు దిక్కున సంస్కర్త యుద్భవము గాలేదు. దాక్షిణాత్యులలో నెల్ల నిట్టి భాగ్యము మన యాంధ్రులకే సంప్రాప్తమయ్యెను. 'నాటుపుర' మందలి యొక విద్యా బోధకునికీ గౌరవము లభించెను ! 1881 వ సంవత్సరము డిసెంబరు