పుట:2015.373190.Athma-Charitramu.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38. "బాల్యస్వర్గము" 377

బాల్యలక్షణ మింకొకటి నిష్కాపట్యము. బాలురస్నేహములు, వారల మధుర భాషణములును సద్భావపూరితములు. ఒకపాఠశాలలో తరగతియందు నొక బాలకునిచెంతఁ గూర్చుండు మని యందున కిష్టపడని విద్యార్థిని నేను నిర్బంధింపఁగా నతఁ డేడ్చి, "మాయిద్దఱికిని విరోధమండి! మేము దగ్గఱగా నుండఁజాలమ"ని వాఁడు మొఱ పెట్టెను. ఆబాలకుని నిష్కాపట్యమునకు నివ్వెఱపడితిని. 'పెద్దవారలగు మా కిట్టి నీతి యుండిన నెంత బాగుండు!' నని నే నపు డనుకొంటిని. లోని తలంపులు బయల్పడకుండఁ జేసికొనుటయె పరమావధియని పెద్దవారల మనుకొనుచున్నాము! కావుననే యేండ్లు పైఁబడినకొలఁది మోక్షదూరుల మగుచున్నాము !

బాల్యలక్షణములలో నొంకొకటి విశ్వాసగుణము. కౌతుకాశ్చర్యములతో జ్ఞానోత్పత్తి యగుచున్నది. ఇవియె విశ్వాసమున కెల్ల మూలకందము. శైశవమున భూలోక మంతయు చిత్రవస్తుప్రదర్శనశాలవలెఁ గానిపించును! ప్రశ్నోత్తరములతో నిండియుండు బాలకుని మనస్సునకు విశ్వాసము పట్టుగొమ్మ యగుచుండును. జననీజనకులు, వయోవృద్ధులును, విశ్వాసపూరిత హృదయులగు బాలకులకుఁ బూజనీయు లగుచుందురు. పిన్న వారల భక్తిప్రేమము లందుకొన నర్హత గలిగి యుండుటకైనను, పెద్దలు పూజ్యత దాల్చియుండుట కర్తవ్యముగదా!

                          "క. గురువులు తమకును లోఁబడు
                               తెరువులు చెప్పెదరు విష్ణుదివ్యపదవికిన్
                               తెరువులు చెప్పరు, చీఁకటిఁ
                               బరువులు వెట్టంగ నేల బాలకులారా?"

అని బాలుఁడగు ప్రహ్లాదుఁడు తోడిబాలకుల కుద్బోధించెను. బాలహృదయములు గ్రోలుటకుఁ దగినమాధుర్యము లేక నిస్సారతను