పుట:2015.373190.Athma-Charitramu.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 376

మణియగు జీవాత్మ, ప్రాపంచిక కలుషములచేఁ గప్పఁబడి, రానురాను తన నై సర్గిక నైర్మల్యమును గోలుపోవుచున్నదని నేను నమ్మెదను.

బాల్యమునకుఁగల ప్రథమలక్షణము, అమాయికత్వము. అది వట్టి యజ్ఞానము గాదు. శైశవమందలి నిర్మలత్వము, ఆత్మకు నైసర్గికముగఁ గల పవిత్రతయె. ఎవ్వాని ఋజువర్తన ప్రభావమున వానియాత్మ యీసౌరభవిశేషమును గోలుపోవదో, వాఁడె ధన్యజీవితుఁడు !

అమాయికత్వ మనఁగా, నిరపరాధత్వమె కాదు, అపరాధ మాచరింప నేరకుండుటయును. శోధనలకు దూరముగ నుండుట కాదు, వానికిలోనయ్యును వాని తాఁకుడును లెక్కసేయ కుండుటయె, యీ యమాయికత్వమునకు గుఱుతు. సుగుణసౌందర్యరాశియగు జానకి యిట్టి యమాయికత్వమునకు గొప్ప తార్కాణము. లోకకష్టములు కలుషములు నాపుణ్యవతి యెఱుఁగకపోలేదు. కాని, యీ సుగుణప్రభావమున, ఆసుశీలకుఁ గలిగిన శోధనలబలము పటాపంచలయ్యెను. ఈ భూ నాటకరంగమున నాకాంత కార్యకలాపము ముగించుకొని, మరల తన జననీగర్భమునకు నిష్క్రమించెను !

శైశవమునకుఁగల ముఖ్యలక్షణము అమాయికత్వమని నావాదము. దీని సరికట్టుట వలన నే నైతికబాలారిష్టములు వాటిల్లుచున్న వని నామతము. పెద్దవారలగు మనలను జూచి బాగుపడుటకు మాఱుగా పిల్లలు మఱింత పాడగుచుండుట, మనకంటె వారలె సజ్జనులని సాటు చున్నది ! పెద్దవారలచేష్టలు చర్యలును పిన్నవారలకు మార్గప్రదర్శనములు గాకున్నవి. మన దురభ్యాసములు దురాచారములును ముఖ్యముగ బాలురు చెడిపోవుటకుఁ గారణము లగుచున్నవి. బాలురు మన దుర్వ్యసనములఁ గనిపెట్టుట లేదనుకొనుటకంటె పెద్ద పొరపాటు లేదు. వేయి కనులతో వారు మన యపరాధముల వీక్షించుచున్నారు.