పుట:2015.373190.Athma-Charitramu.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 378

దాల్చియున్నవి, పెద్దలగు మన చరిత్రములు ! ఇ ట్లనుటవలన పెద్దవార లందఱు దుశ్చరితులని నేఁ జెప్పుటలేదు. చిన్నవారల చిత్తముల నాకర్షింపఁగల యోగ్యత మనలో మట్టుపడుచున్న దనియే నామొఱ !

బాలుర మంచిలక్షణముల పూర్తిపట్టిక నిచ్చుట నాతలంపు గాదు. అమాయికత్వము నిష్కాపట్యము విశ్వాసము మున్నగు సుగుణములు, బాల్యమునకుఁగల సౌందర్యగౌరవములకు హేతువులు. పెద్దలను గ్రిందుపఱుచుట నా యభిప్రాయము కాదు. సుగుణములతోఁ జెన్నొందు పెద్దఱిక మెప్పుడును శ్లాఘాపాత్రమె. అమాయికత్వాదిగుణ భూయిష్ఠమగు బాల్యము, సుజ్ఞానోపేతమగు పెద్దఱికముగఁ బరిణమింపవలయు ననియె నామతము. నిష్కపటుఁడగు బాలకుఁడు, నిర్మలినుఁడును, నియమబద్ధుఁడునగు పురుషునిగ వికసన మందవలయును. బాల్యమున వార్ధకపు దుర్గుణములును, వార్ధక్యమున యౌవనమదాంధత్వమును, బొడసూపుటకంటె ననర్థ మేమిగలదు? పెద్దవారలు తమపెద్దఱికమును నిలుపుకొను నుదార చరితులై, పిన్న వారలకు శీలసౌష్ఠవ మేర్పడుటకు సహకారు లయ్యెదరుగావుత !

39. "వీరసంస్కర్త"

నా రెండవ వ్యాస మగు "వీరసంస్కర్త" సార మిచట వివరింపఁబడుచున్నది : -

'కార్లైలు'శూరనామమును వివిధవృత్తులలోనుండువారల కొసంగి యున్నాఁడు. తన విధ్యుక్తములను ధైర్యసాహససద్భావములతో నిర్వర్తించువాఁడె శూరుఁడు. కత్తిగట్టి దేశస్వాతంత్ర్యమునకై పోరాడు సైనికునివలెనే, స్వదేశమును గలంచెడి దురాచారముల నెదుర్కొని, వానిని నిర్మూలన మొనరింపనూనెడివాఁడును శూరుఁడె.