పుట:2015.373190.Athma-Charitramu.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 360

పోయి చాలదినములవఱకును నాభార్య బెజవాడ చేరకుండుటచేత, కొన్ని రోజులు శిష్యమిత్రులు నాకు వంట చేసిపెట్టిరి. ఒక్కొకప్పుడు వంటపని నామీఁద పడుచుండుటచేత పాఠశాలపనికిని, ఇతర పనులకును వ్యవధానము చాలక, చికమకలు పడుచుండువాఁడను. దీనికిఁ దోడు, నా మనస్సీమను పాపపుఁదలంపు లేపారి తిరుగాడుచుండెను ! ఎక్కువపనిచే నేను డస్సియుండినను, పలువిధములగు దుష్ట సంకల్పములు నన్ను విడువనొల్లక, నా మనోవీథిని స్వైర విహారములు సల్పుచుండెడివి ! జీవిత మొక విషాదాంతనాటకముగఁ బరిణమిల్లు నట్లు తోఁచెను. ఇదిగాక, జ్వరముచేఁ బీడింపఁబడినప్పు డైనను తోడి క్రైస్తవబోధకునివలె నొక దినమైనను నేను బడి మానరాదు ! ఐరోపావారు పక్షపాతబుద్ధితో భరతదేశమున క్రైస్తవమతప్రచారము సల్పుచున్నా రని నేను మొఱలిడువాఁడను. ఈ చిక్కులలో నేను మరల న్యాయశాస్త్రసంబంధమగు చదువు సాగించితిని.

ఇట్టి విషమస్థితిలో నాకు 7 వ జూలయిని రెండు జాబులు వచ్చెను. అవి రెండును మా ఋణములనుగుఱించినవియే ! తన కీయవలసిన వేయిరూపాయిలు నీయు మని యొక ఋణదాత నిర్బంధించెను. రెండవయుత్తరము మాతమ్ముఁడు వ్రాసినది. మాకు బదు లిచ్చిన వేలివెన్ను కమ్మస్త్రీ యొకతె మామీఁద వ్యాజ్యెము వేసినటు లందుండెను !

10 వ తేదీని నాభార్య తన పినతండ్రితో బెజవాడ వచ్చెను. రాజమంద్రిగాని బెజవాడగాని తనను దీసికొని వచ్చు బంధువులు లేకుండుటవలన తనరాక కీ యాలస్య మయ్యె నని యామె సమాధానము.