పుట:2015.373190.Athma-Charitramu.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34. "జీవాత్మ - పరమాత్మలు" 361

వేలివెన్ను ఋణదాత కిచ్చుటకై పాఠశాలలో పండితులగు కామశాస్త్రిగారియొద్ద నిన్నూఱు రూపాయలు నే నప్పు పుచ్చుకొని, 15 వ జూలై శనివారమునాఁడు రెయి లెక్కి, నిడదవోలులో దిగితిని. అచట తమ్ములు కృష్ణయ్య వెంకటరామయ్యలు నన్నుఁ గలసికొనిరి. అట్లపాడుమీఁదుగ మేము పోవుచుండఁగా పింగళివారి పెద్దకోడలు అత్తమీఁదికోపమున కాలువలోఁ బడిపోయె నని మాకచటఁ జెప్పిరి.! శవ మింకను కానఁబడలేదు. రాత్రికి మేము వేలివెన్ను చేరి యచట జరిగిన వీథినాటకము చూచి సంతోషించితిమి.

మేము బాకీపడిన కమ్మస్త్రీతో రాజీ కుదరకుండ నొక తుంటరి యడ్డపడుటచేత, మఱునాఁడు గ్రామము విడిచిపోయితిమి. నేను బెజవాడ చేరినమఱునాఁడే మా పొరుగుననుండు యువతి యొకతె గృహల్లోలములచేత బందరుకాలువలోఁబడి యాత్మహత్య గావించుకొనెను ! మనదేశమునఁ గోడండ్ర ఘోరదుర్మరణము లెపుడంతరించునోకదా!

26 వ జూలయి తేదీ దినచర్య నా కా దినములలోఁగల బాధ నొకదానిని తేటపఱుచు చున్నది : - "న్యాయశాస్త్రపుఁ జదువులు, పాఠశాల పనులును - ఇపుడు నా నిత్యకార్యక్రమము. * * * ఈ భార్యతో నే నెట్లు వేఁగఁగలను? ఒకనాఁడు ముడుఁగుదామర, ఒకనాఁడు వికచపద్మమునగు నీ కలహాంతరితను పైసలేని నే నెట్లు ప్రసన్నవదనఁ జేయఁగలను ? ఎటు లాభరణములకు ధన మొసంగి సంతృప్తఁ జేయఁగలను ?"

తమ్ముఁడు రాజమంద్రిలో చిల్లరయప్పులు తీర్చి వేయుచుండెనని తెలిసి సంతోషించితిని. వేలివెన్ను వ్యాజ్యెము జరుగుచునే