పుట:2015.373190.Athma-Charitramu.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34. "జీవాత్మ - పరమాత్మలు" 359

నా దేహారోగ్య మెటు లుండినను, ఆత్మారోగ్యము మాత్రము క్రమముతప్పి యుండెను. నా యాత్మకు పాపేచ్ఛ యనునది జీర్ణ వ్యాధిగఁ బరిణమించెను ! ఆత్మావ్యాధులు సులభ నివారితము లని పూర్వము నే ననుకొనువాఁడను గాని, అంతకంటె మొండిరోగము లుండవని నా కిపుడు ద్యోతక మయ్యెను.

1 వ జూన్ తేదీని మిత్రుఁడు కనకరాజు భార్య చనిపోయె నను దు:ఖవార్త విని, నా సంతాపమును సానుభూతిని దెలుపుచు నాతని కొకలేఖ వ్రాసితిని. 18 వ జూన్ ప్రొద్దున బెజవాడ పయనమయితిని. రెయిలులోఁ గూర్చుండి నే నిట్లు తలపోసితిని : -

"ఈ సెలవులలో రాజమంద్రిలో నుండురోజులలో నేను తల్లితో ధారాళముగ మాటాడలేకపోయితిని. విపరీత మిత భాషిత్వము నన్నావహించి యుండెను. దీనికితోడు, ఆమె రుసరుసమనుచు, విరోధ భావమున మెలంగెడిది. తుదిదినములలో మా తండ్రియు నిట్లే యుండెడివాఁడు. కావుననే నే నాయనతో మనసిచ్చి మాటాడనేరకుండెడివాఁడను !" రెయిలులో నేను విశాఖపట్టణమునుండివచ్చు దాసుగారిని గలసికొంటిని. మరల మేము మిత్రులమయితిమి. నేను బెజవాడలో దిగునప్పటికి నన్నుఁ గలసికొనుటకు రాజారావు, విద్యార్థి పానకాలును గనిపెట్టుకొని యుండిరి. రాజారావునింట నేను భుజించితిని. బెజవాడలో ఆస్తికసమావేశము జరిపింతుమని ప్రకటించిన రాజగోపాలరావు మీఁద నేను కోపించితిని.

34. "జీవాత్మ - పరమాత్మలు"

ఆ వేసవిసెలవుల పిమ్మట బెజవాడలో యథాప్రకారముగ నాపనులు నేను జేయుచువచ్చితిని. పుట్టినిల్లగు కట్టుంగ