పుట:2015.373190.Athma-Charitramu.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 350

వెంకటరత్నమునకు నియోగి సమాజమువారి వేతనమును సంపాదించితిని. ఇదిగాక నేను వ్రాసిన ద్రౌపది చరిత్రకు నేఁడు శుద్ధప్రతి వ్రాసితిని.

నిరుడు బెజవాడలో నాయొద్ద నాలుగవ తరగతిలోఁ జదివిన నాతమ్ముఁడు సూర్యనారాయణ, ఈసంవత్సరము బెజవాడ రానని జనవరి తుదివారములో నాకుఁ దెలియఁబఱిచెను. మాతండ్రి చనిపోయిన పిమ్మట బెంగపెట్టుకొని, తల్లిని విడిచి యిచ్చటికి వచ్చుటకు వాఁ డిచ్చగింపకుండెను.

యూనిటేరియను మత సంఘమువారి ప్రచురణము లనిన నాకిదివఱకు తలనొప్పిగ నుండెడిది. యూనిటేరియను గ్రంథకర్తయగు ఆరమ్‌స్ట్రాంగు వ్రాసిన "జీవాత్మ పరమాత్మలు" అను గ్రంథమును బాగుగ విమర్శనము చేసినవారికి బహుమతి నిచ్చెదమని ఆ మతసంఘమువా రిపుడు ప్రచురించిరి. మిత్రుఁడు రాజగోపాలరావునొద్ద నే నాపుస్తక ప్రతిని ఎరవు పుచ్చుకొని చదివితిని. అది రమ్యముగ నుండెను.

26 వ జనవరి తేదీని వెంకటరత్నమునాయఁడుగారు బందరునుండి వచ్చిరి. ఉద్యోగాన్వేషణమునకై వా రిపుడు హైదరాబాదు పోవుచుండిరి. ఇట్టి సుశీలుఁడు ప్రతిభావంతుఁడును క్రైస్తవ మతసంఘమువారి కొలువున నుద్యోగముఁ గోల్పోయెనే యని నేను విషాద మందితిని.

మరల నేను న్యాయశాస్త్ర పుస్తకములు విప్పితిని. మాతండ్రి చిన్ననాఁ డెంత బోధించినను నే నాచదువుదెస పెడమొగము పట్టియెయుంటిని. ఆయన చనిపోయిన పిమ్మట నా కా చదువునందు విపరీతాభిరుచి జనియించెను !