పుట:2015.373190.Athma-Charitramu.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

31. ప్రాథమిక పరీక్ష 349

ణములు పట్టువడకున్నవి ! విషయవాంఛలు నాకు వారసత్వపు టాస్తివలె నయ్యెను. ఇంతకాలమునకైన పాపిష్ఠ చక్షువులకు వైరాగ్య మొనఁగూడకున్నది! భగవానుఁడా, నాకు హృదయపారిశుద్ధ్యము ప్రసాదింపుము."

ప్రాథమిక పరీక్షలమూలమున నాకు నిత్యసహవాసులైననాయఁడుగారితో పలుమాఱు ఆత్మీయవిషయములను గుఱించి ముచ్చటించు చుండువాఁడను. నావలెనే తానును గొన్ని లోపములకు లోనగు చుంటి నని యాయన మొఱపెట్టువాఁడు. సమయపాలన విషయమునం దాయన వెనుకఁబడి యుండిరి. మనవలెనే యితరులును లోపములకు లోనయిరని వినుటవలన, మనసున కొకింత శమనము గలుగుచుండును.

16 వ తేదీని మేము ప్రాథమికపరీక్షకై రేపల్లె వెళ్లినప్పుడు, అచట నిరుడు ప్రధానోపాధ్యాయుఁడుగ నుండిన తమ్ముఁడు వెంకటరామయ్యకును నాకునుగల పోలికలను గుఱించి యచటివారు చెప్పుకొనసాగిరి. సోదరుఁడు విడిసియుండు గృహము నా కచటివారు చూపించిరి. అతని మిత్రుఁడగు లక్ష్మీనారాయణగా రను నుపాధ్యాయుఁడు మాకు విందొనర్చెను.

ఒక్కొకనాఁడు ముమ్మరమగు పనితో నేను నలిఁగిపోవుచు వచ్చితిని. సెలవుదినములలో నా కీపను లెక్కువగ నుండెడివి. 22 వ జనవరి ఆదివారమునాఁడు నే నెన్నియో సభలకుఁ బోవలసి వచ్చెను. ఆనాఁడు సంఘ సంస్కరణ సభను జరిపితిమి. మా సమాజాదరణమున స్త్రీల సభలు సమకూర్చుటకును, బాలికాపాఠశాల నొకటి నెలకొల్పుటకును మేము నిశ్చయించుకొంటిమి. ఆఱువేల నియోగి సభా సమావేశములు రెండింటికిని నేను బోయితిని. కొంత శ్రమపడి బావమఱఁది