పుట:2015.373190.Athma-Charitramu.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20. చెన్నపురి యుద్యోగము 299

దండ్రుల యాలోచన నడుగుటకై నే నారాత్రియె రెయిలులో బయలుదేఱితిని. మాయింటి కదివఱకు వచ్చియుండిన నాపెద్దమేన మామయు, నాభార్యపెదమేనమామయును నాతో రాజమంద్రి కపుడె బయలుదేఱిరి.

నేను రాజమంద్రి చేరు నప్పటికి మాతల్లి వేలివెన్ను వెళ్లి యుండెను. ఇంట తండ్రియు, తమ్ములు నుండిరి. చిన్న చెల్లెలు జబ్బుగ నుండెను. రాజమంద్రిలో మావారల స్థితిగతులు దైన్యముగ నుండెను. నా చెన్నపురి ప్రయాణమునకు మా మామగారామోదించిరి. కాని, మాతండ్రి యేమియు ననకుండెను. ఆయనకు జ్యౌతిషమునం దభిమానమును, కొంత పరిచయమును గలవు. గోచారమును బట్టి నాకు త్వరలో "స్థానభ్రష్టత్వము, ధనక్షయమును" గలుగునని మాత్ర మాయన చెప్పెను ! ఈ యుద్యోగమునుతప్పక స్వీకరించి, యం. యే. పరీక్షకుఁ జదువు మని వీరేశలింగముగా రనిరి. నే నంతట బెజవాడ వెడలిపోయి, 17 వ సెప్టెంబరు చెన్నపురిలోని పనిలోఁ జేర గలనని అయ్యరుగారికి తంతి నంపితిని.

నే నిపుడు బెజవాడయుద్యోగముసంగతి యేమిచేయవలెనో తోఁపకుండెను ! నాపనికి రాజీనామా నీయవలె ననియె నేను మొదట నెంచితిని. కాని, యది మంచిది కాదనియు, కొంతకాలము సెలవు పుచ్చుకొని, క్రొత్తపనిలోఁ బ్రవేశించిచూచుట యుక్తమనియు, ప్రధానోపాధ్యాయులు దాసుగారు నాకు సలహానిచ్చిరి. సెప్టెంబరు 15 వ తేదీనాఁటికి మాపాఠశాలకు పరీక్షాధికారి తనిఖీ యగును గావున, అప్పటినుండి నా కిచ్చట సెలవు దొరకవచ్చు ననికూడ వారు చెప్పిరి. వారిసలహా చక్కఁగ నుండెను.