పుట:2015.373190.Athma-Charitramu.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 298

ఆమఱునాఁటినుండియు నే నాపని నిమిత్తమై కృషి చేసితిని. ఆపాఠశాలాధికారి, "హిందూపత్రికా" ముఖ్యవిలేఖకులగు జి. సుబ్రహ్మణ్యయ్యరుగారు. వీరే కొన్ని సంవత్సరములక్రిందట నాకును మిత్రుఁడు మృత్యుంజయరావునకును తమపాఠశాలలో పేరునకు బోధకోద్యోగము లిచ్చినవారు. వీరికి నన్ను గూర్చి సిఫారసు చేయుఁడని రాజమంద్రి యందలి న్యాపతి సుబ్బారావుపంతులు, వీరేశలింగముపంతులుగార్లకును, మద్రాసునందలి బుచ్చయ్యపంతులుగారికిని నేను జాబులు వ్రాసితిని. వా రందఱును నన్ను గుఱించి అయ్యరుగారికి గట్టి సిఫారసులు చేసిరి.

అంత 11 వ ఆగష్టు తేదీని సుబ్రహ్మణ్యయ్యరుగారి యొద్దనుండి నాకొక లేఖ వచ్చెను. నాకు నెల కేఁబదిరూపాయిలు జీతమీయఁ గలమని వారు వ్రాసి, నే నెంత ర్వరలో తమపాఠశాలలోఁ జేరఁగలనో వ్రాయుఁడని యడిగిరి. ఆమఱునాఁడే నే నిట్లు అయ్యరుగారికి తంతి నంపితిని : - "వందనములతో నుద్యోగస్వీకారము చేయు చున్నాను. అఱువదిరూపాయి లియ్యఁగోరెదను. ఒక నెలలో చేరఁ గలను. నాపని తృప్తికరముగ నున్నచో, కొన్ని సంవత్సరములవఱకును మీపాఠశాలలో నుద్యోగము నాకు స్థిరమని చెప్పఁగోరెదను."

ఈ తంతి నంపి, మఱు నిమేషమునుండియె వారి జవాబున కెదురు చూచుచుంటిని ! కాని, మఱునాఁటి సాయంకాలము వఱకు నాకుఁ బ్రత్యుత్తరము రానేలేదు. అంత రాత్రి తొమ్మిది గంటలకు జవాను నాకొక తంతి తెచ్చియిచ్చెను. దానిలో నిటు లుండెను. "వందనములు. రాఁబోవుజనవరిలో నేఁబదియైదును, మఱుసటివత్సరము అఱువదియును ఇచ్చెదను. సెప్టెంబరు మొదటితేదీని మీరు చేరవలెను." ఈతంతి నందుకొని రాజమంద్రిలోనుండు తలి