పుట:2015.373190.Athma-Charitramu.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 290

నియె నని విమర్శకులు గేలిచేసిరి ! మిల్టనుని సైతానునందు నాచత్వ హీనత్వములు గానరావు. నరకలోకకుడ్యములు తన గంభీరోపన్యాస గర్జనములకు మాఱుమ్రోఁగునట్టుగ సహచరులతోఁ బ్రసంగించి, తన ధీరవచన గాంభీర్యమహిమమున వారల నందఱిని పరమేశ్వరుని మీఁది కెత్తివచ్చునట్టు పురికొల్పఁ గలుగుట సామాన్యప్రతిభము కానేరదు. మిల్టనుకవి, పుక్కిడిపురాణముల సైతానునిగాక, తన సోదరాంగ్లేయు లనుదినమును నగరఘంటాపథంబుల సందర్శించెడి స్వదేశీయ సమకాలిక సరసాగ్రగణ్యుఁడగు సైతానునే వారలకుఁ బ్రదర్శించెను !

"ఈ సైతానుకూడ ప్రకృతకాలమున పదనుడిగి ప్రాఁతగిల్లి పోయినవాఁడె ! అంత పందొమ్మిదవశతాబ్ద మధ్యమునఁ బ్రసిద్ధినొందిన కార్లయిలు రచించిన "సార్టారు రిసార్టసు" నందలి సైతాను వినూతనకాంతులతో విరాజిల్లెను. "సైతాను నీవెలుపల లేఁడు. నీ యంతరంగముననె యాతఁ డణఁగి మణఁగియున్నాఁడు !" అనువేదాంత రహస్యమె కార్లయిలుని సిద్ధాంతసారము.

"ఇంతకంటెను నూతనమగు సైతానుని మన మాధునికాంగ్ల సారస్వతమునఁ బొడఁగాంచఁగలము. మేరీకొరిల్లేకన్యక రచించిన "సైతానువెతలు" అను గ్రంథమునందు సైతానుని ప్రకృత వృత్తాంత కథనము గాననగును. ఇందలి కథానాయకుఁడగు 'టెంపెస్టు' , దరిలేని పేదఱిక మనుభవించుచు నొకనాఁ డాకస్మికముగ నైశ్వర్యవంతుఁడైన యొకలండనునగరనివాసి. ఆ సుదినమున లూసియోరైమానెజ్ అను నొక రాజకుమారుఁ డాయనకు స్నేహితుఁడు సహచరుఁడునై, టెంపెస్టు తనసర్వస్వమును గోలుపోయి మరల దుర్భరదారిద్ర్యదశకు దిగువఱకు నాతనికి విడనాడకుండెను ! అకాలమున లూసియో కనఁబఱచిన శక్తిసామర్థ్యము లన్నియు సైతానుని కళలె ! ప్రకృతకాలపు పురుష