పుట:2015.373190.Athma-Charitramu.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18. "ప్రాచీన నవీన సైతానులు" 291

వర్యుల యతులిత మేధాశక్తి, వాక్చాతుర్యము, శృంగార విలాసములును, లూసియోయందుఁ జక్కఁగఁ బ్రదర్శితములయ్యెను. ఈ శోధనలలోఁ జిక్కువడవలదని శోధకుఁడు మాటిమాటికిఁ దన్ను వారించుచున్నను, కుశాగ్రబుద్ధియగు టెంపెస్టు ఆసుడిగుండములలోనే పడి కొట్టుకొని పోవుచుండెను ! ఇదియె ప్రకృతపు సైతానుని స్వభావలక్షణము. భాగ్యవంతుల మాయామర్మములందును, ధనికుల దురంత దుష్కృతములలోను, లక్ష్మీపుత్రుల లోభమోహములలోను, స్త్రీపురుషుల గూఢవ్యభిచారము లందును, - ఈనాఁటిసైతాను ప్రత్యక్షమగు చున్నాఁడు !

"ఈ నూతనమగు సైతానుని నమ్మిక లొక్కింత విమర్శింతము. సైతానునికి దైవవిశ్వాసము లేకపోలేదు. ఈశ్వరాజ్ఞోల్లంఘనము మాత్ర మతనికిఁ గడుప్రీతి. సైతాను 'పాపాలభైరవుఁడ'ని ఘోషించునవి బైబిలుక్రైస్తవమతములు మాత్రమె. కొరిల్లీకన్యక వర్ణించిన సైతా నట్లు వర్తింపక, మనుష్యుడు నూతనదుష్పథము త్రొక్కి చూచినపుడెల్ల దు:ఖాతిరేకమున వెతనొందుచుండును. కావుననె యీగ్రంథమునకు "సైతానువెతలు" అను నామకరణము గలిగెను. నరుఁడు చేయు పాపకార్యముల కెల్ల సైతాను వగచుచునేయుండును !

"ఈ పుస్తకమందలి సైతా నిట్లు ఘోషించుచున్నాఁడు : - 'స్త్రీపురుషుల పాపపరంపరయె దరిలేని నాదు:ఖాబ్ధి ! స్వేచ్ఛా పేక్షగల నన్ను బందీకృతునిఁ జేయుచున్న దిదియె. ఇదియె నాకు నరక లోకావరణమున గల్పించి, నన్ను మితిలేని వెతలపాలు చేయుచున్నది. ఇదియె నన్ను బంధించి, ఛేదించి, వికృతాంగునిఁ జేయుచున్నది !