పుట:2015.373190.Athma-Charitramu.pdf/316

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 276

భార్యతోను, బావమఱదిఁతోను పడవమీఁద బయలుదేఱి, నేను 3 వ తేదీకి రాజమంద్రి వచ్చితిని. మాతండ్రి యదివఱకే వచ్చి యుండెను. స్నానము చేయునపుడు నా కుడి మోకాలిమీఁద కొంచెము వాఁపు కనుపించెను. అక్కడ కొంత నొప్పిగ కూడ నుండెను. ఇది లెక్కసేయకయే నా పనుల మీఁద నేను పట్టణమునఁ దిరుగాడితిని. మఱునాఁటి సాయంకాలమునకు నా కించుక జ్వరము సోఁకెను. నా మోకాలికీలు పొంగి, అడుగు తీసి యడుగు వేయ లేనిస్థితికి వచ్చితిని ! రాత్రి యెంతో బాధపడితిని.

మఱునాఁడు రంగనాయకులునాయఁడు గారు వచ్చి, యిది కీళ్ల వాతము కాదని చెప్పి, వాఁపుమీఁద రాయుటకు కర్పూరతైల మంపిరి. దానివలన లాభము లేకపోయెను. అత్తిలిలోని భూములదస్తావేజు వ్రాసి ఆవ్యవహారము పూర్తిపఱుచుటకు మా నాయనయు, పెద్ద తమ్ముఁడును, ఆ సాయంకాలమే పడవమీఁద వెడలిపోయిరి. నాకు శరీరములో నెటులుండినను, ఒకటిరెండురోజులలో నేను అత్తిలి తప్పక వచ్చి, అచట పనియైన పిమ్మట నే నింటికి తిరిగి రావచ్చునని వారు చెప్పిరి. అట్లే చేయుదు నంటిని.

మూలుగుచునే నే నానాఁడు "జనానాపత్రిక"కు వ్యాసములు వ్రాసితిని. రాత్రి యంతయును, మోకాలిపోటు చెప్పనలవి కాకుండెను. మఱునాఁడు నాయఁడుగా రిచ్చినమందు మ్రింగితిని కాని, నా కేమియు నుపశమనము గలుగ లేదు. ఆ రోజుకూడ పత్రికకు వ్రాయుచునేయుంటిని.

7 వ తేదీకి నావ్యాధి ముదిరిపోయెను. తమ్ముఁడు కృష్ణయ్యచే పత్రికకు వ్యాసములు వ్రాయించి, ఆ కాకితములు అచ్చునకై బెజవాడ కంపివేసితిని. నే నిపుడు నడచుట యటుంచి, సరిగా నిలుచుం