పుట:2015.373190.Athma-Charitramu.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15. కీళ్ల వాతము 275

చేస్తాను. అత్తిలి వెంకటరత్నంగారిపేర వుత్తరం 15 రోజులకిందట వ్రాశినాను. జవాబు లేదు. నేను వెళ్లి అత్తిలి వగైరాలు కనుక్కుని వారం రోజులలో తిర్గి రాజమంద్రికి చేరి వుత్తరం వ్రాస్తున్నాను."

ఆ సంవత్సరము డిశెంబరులో జరిగెడి ప్రవేశ పరీక్షకు తమ్ముఁడు కృష్ణమూర్తి పోయియుండెను. శీతకాలపు సెలవులలో మే మిరువురమును రాజమంద్రి వెడలిపోయితిమి. అక్కడనుండి నాభార్య తన పుట్టినింటికి కట్టుంగ పోయెను. రక్తగ్రహణిచే నే నాదినములలో నధికముగ బాధపడితిని. అత్తిలి భూముల యమ్మకమునకై నన్ను రేలంగి రమ్మని చెప్పి ముందుగ మాతండ్రి రాజమంద్రినుండి బయలుదేఱెను. కొంచెము నీరసముగ నుండినను నేను రేలంగి ప్రయాణమైతిని. ఎంతో ప్రయాసపడి నే నచటికి డిశంబరు తుది దినములలోఁ జేరితిని. కాని అప్పటి కింకను వ్యవహారము తెమలకపోవుటచేత, భార్యను రాజమంద్రి కొనిపోవుటకై యచటినుండి నేను కట్టుంగ పయనమైతిని.

15. కీళ్ల వాతము

నేను రేలంగినుండి డిసెంబరు 31 వ తేదీని ప్రొద్దుననే బయలు దేఱి, కాలినడకను మధ్యాహ్నమునకు కట్టుంగ జేరితిని. నాఁడు కటిస్థలమున నొప్పిగ నుండినను, నే నది లెక్కసేయ లేదు. ఆగ్రామములో మాయత్తమామలు, వారి కుమారుడు, కొమార్తెలు నుండిరి. మాబావమఱఁదితో ముందలి సంగతు లాలోచించుచు, జనవరి 1, 2. తేదీలలో నేనచటనే యుంటిని. ఈసంవత్సర మైనను నేను యల్. టి. పరీక్షలో గెలుపొందనిచో, నా కిష్టములేని న్యాయవాదివృత్తిలోఁ బ్రవేశించుటకై, న్యాయశాస్త్ర పరీక్షకుఁ జదువ నాయుద్దేశమని చెప్పి వేసితిని. ఇది యాతఁ డామోదించెను.