పుట:2015.373190.Athma-Charitramu.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15. కీళ్ల వాతము 277

డుటకైన శక్తిలేక యుంటిని ! ఈ దురవస్థలో నేను అత్తిలి రాఁజాల నని మాతండ్రికిని తమ్మునికిని దెలిపి, త్వరగా వారిని రాజమంద్రి తోడితెమ్మని తమ్ముఁడు కృష్ణయ్య నచటికిఁ బంపితిని. ఇంట నాకు మందుమాకులు తెచ్చి యిచ్చుటకుఁ బసివాఁడగు సూర్యనారయణ యొక్కడే కలఁడు. ఐన నాతనివి యినుపకాళ్లు ! పగలనక రాత్రి యనక యాతఁడు నామందులకొఱకై తిరుగాడఁ జొచ్చెను. రాత్రులు కాలిపోటు లెక్కువయై నేను తీవ్రవేదన నొందునపుడు, హాస్యపుఁబలుకులు పలుకుచు, మా చిన్న తమ్ముఁడు నాచెంతఁ గూర్చుండువాఁడు. లోకువయగు వానిని నే నపుడు తిట్టుచుఁ గొట్టుచును, రోగముమీఁది కసి చిన్న వానిమీఁద దీర్చుకొనుచుండువాఁడను ! తీవ్రవేదనకు నేను దాళలేనపుడు, అతఁడు నాకు 'పెర్రిడేవిసు'ని "పెయిన్ కిల్లరు" తెచ్చి పూయుచుండుటవలన, 'పెర్రిడేవిసు' అను నామమిడి, తమ్ముని నిరసనతోఁ బిలుచుచుండువాఁడను ! వేదనాభరమున నే నాడెడి దూషణోక్తులకు వాఁ డించుకయుఁ గినియక, నాపిచ్చిపలుకులను గాకితముమీఁద నెక్కించి చదివి నాకు నవ్వు తెప్పించుచు, అందు మూలమున నా కొకింత బాధాశమనము గల్పించుచుండువాఁడు !

తీవ్రవేదనకు లోనగు నాకుఁ బగలు రాత్రియు నొకటియే యయ్యెను ! ఎన్నిదినములకును తండ్రియుఁ దమ్ములును అత్తిలినుండి రాకుండిరి. ఎట్టకేలకు 11 వ జనవరి సాయంకాలమునకు సోదరులు వచ్చిరి. కొలఁదిదినములలో తాను న్యాయవాదిపరీక్షకుఁ బోవలసి యుండియు, నారోగోపశమనమునకై తమ్ముఁడు వెంకటరామయ్య యెంతో ప్రయత్నించెను. అంత వైద్యము మార్చివేసితిమి. డిస్ట్రిక్టు సర్జను డాక్టరు సార్కీసు దొర యొద్ద మాతమ్ముఁడు నాకు మందు తెచ్చి యిచ్చెను. అదియు నా కేమియుఁ బ్రయోజనకారి కాకుండెను.