పుట:2015.373190.Athma-Charitramu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 206

26 వ నవంబరున నేను మృత్యుంజయరావుతోఁ బరశువాక మేగితిని. అక్కడకు పట్టపరీక్షనిమిత్తమై కనకరాజు వచ్చియుండెను. గంగరాజును కనకరాజును మే మిరువురమును నూతనపాఠశాలను గుఱించి సవిస్తరముగ మాటాడుకొంటిమి. మాధ్యమికపాఠశాలలో నేను బని చేయ నని చెప్పివేసితిని. అంతట కనకరాజు నరసింహరాయఁడు, మృత్యుంజయరావుగార్లు ముగ్గురును గలసి, మాధ్యమికపాఠశాల నెలకొల్పెద మనియు, "సత్యసంవర్థని" ని వారపత్రికగాఁ జేయుదు మనియుఁ జెప్పిరి. సత్యసంవర్థనితో వివేకవర్థనిని జేర్చుట నా కిష్టమా యని వీరేశలింగముగారు నాకు వ్రాసిరి. "ఆస్తికపాఠశాల"లో నా కిఁక జోక్యము లే దనియు, "సత్యసంవర్థని" నెటులైన మార్పవచ్చు ననియు, నేను పంతులుగారికి వ్రాసివేసితిని. రాజమంద్రిలో నొంకొక మాధ్యమిక పాఠశాలనైన దొరతనమువా రంగీకరింప నట్లు తెలిసికొంటి నని మృత్యుంజయరావువార్త గొనివచ్చెను.

నే నంతట వేఱు ఉద్యోగమునకై ప్రయత్నించితిని. రాజమంద్రిలో దొరతనమువారు స్థాపింపనున్న బోధనాభ్యసన కళాశాలలో నాకుఁ బని దొరకవచ్చును. కాని, దొరతనమువారి కొలువులో నేను జేరఁదలఁచుకొనలేదు. రాజమంద్రిక్రైస్తవపాఠశాలలో ప్రథమోపాధ్యాయపదవిసంగతికూడ నింకను స్థిరపడలేదు. యలమంచలి, అమలాపురము పాఠశాలలలో ఖాళీ లున్న వని తెలిసి, నేను దరఖాస్తుల నంపితిని. ఏదేని యొకయుద్యోగములోఁ బ్రవేశించి, కుటుంబపోషణముఁ జేసికొనఁగోరితిని. సైదాపేటకళాశాలలోని నాచదు వంతట ముగిసెను. నేను భార్యయు పరశువాకము వచ్చి, బుచ్చయ్యపంతులు గారియింట విడిసియుంటిమి. అపుడపుడు వ్యాధిపీడితుఁడ నగుచుండియు, నేను బరీక్షకు శ్రద్ధతోఁ జదివితిని. 1894 సం. 22 వ జనవరిని మా