పుట:2015.373190.Athma-Charitramu.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48. ఆస్తిక పాఠశాల 205

లేనిచో, కుటుంబపోషణమునకై నేను వెంటనే మఱియొక పాఠశాలలో నుద్యోగమును సంపాదింపవలెను. ఈ ద్వంద్వరాహిత్య మైనఁగాని, నాకు ముక్తిగానఁబడదు !

నవంబరు నాలుగవతేదీని మృత్యుంజయరావుతోఁ గలసి నేను పట్టణము పోయితిని. దుగ్గిరాల రామమూర్తిగారుఁ వెంకటరత్నమునాయఁడుగారు, మే మిరువురము నంత పెరంబూరుపోయి, డైరక్టరుగారి యాంతరంగికకార్యదర్శి యగు శేషాద్రిఅయ్యంగారిని గలసికొని, ఆయనతో రాజమంద్రిలో బోధనాభ్యసనకళాశాల యేర్పడుటను గూర్చి సవిస్తరముగ మాటాడితిమి. రాఁబోవుసంవత్సరమునుండియు, రాజమంద్రిలో దొరతనమువారు బోధనాభ్యసనకళాశాల నెలకొల్ప నిశ్చయించి రనియు, దాని కనుబంధముగ నుండు నున్నతపాఠశాలకు పోటీగా నింకొకపాఠశాల నాప్రదేశమున వారు స్థాపింపనీయరనియును, ఆయన నిష్కర్షగఁ జెప్పివేసెను. మేమంత సైదా పేట వచ్చివేసితిమి. నేను నాముందలిప్రణాళిక నేర్పఱుచుకొంటిని. రాజమంద్రిలో "ఆస్తికపాఠశాల" స్థాపించుట కవకాశము లేదు గావున, నే నింకొకయుద్యోగమునకై ప్రయత్నము చేయుటకు నిశ్చయించు కొంటిని. ఈసంగతులు తెలియఁబఱచుచు, వీరేశలింగముగారికి నాసోదరునికిని 17 వ నవంబరున నేను రాజమంద్రికి జాబులు వ్రాసితిని.

వీరేశలింగముగా రంత నింకొక యాలోచన చేసిరి. ఉన్నతపాఠశాల నెలకొల్పుట యసంభవ మైనచో, మాథ్యమికపాఠశాల స్థాపింపఁ గూడదా ? పరిస్థితు లనుకూల మైనపిమ్మట, ఆచిన్న పాఠశాల పెద్దది కావచ్చును. ఈ మాథ్యమిక పాఠశాలాస్థాపననిమిత్తమై పంతులుగారు రెండుమూఁడువేల రూపాయలు విరాళ మిచ్చెదరు - ఈమాఱు నాయుద్దేశ మేమి ?