పుట:2015.373190.Athma-Charitramu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 172

మనుమనిపురోభివృద్ధి గోరి వృద్ధురాలగు మాయమ్మమ్మ పంపినట్టియు, పతిసేమ మారసి నాభార్య భద్రముగఁ గొనివచ్చినట్టియు, సందేశవిశేషము ! ప్రాఁతగిల్లినప్రేమను జూపు ముత్తువమాటలు మనుమనికి నచ్చినను నచ్చకున్నను, నవయౌవనమున విలసిల్లు సతినూతనానురాగ యుతమగు హితోక్తులు పతిచెవి కెక్కు ననుట స్పష్టము కావున, సంస్కరణోద్యమముదెస నెటులైన నాకు విముఖత్వము గలిగింప నీయాఁడువా రిద్దఱు నాలోచించుకొనిరి !

ఈవేసవిలో వీరేశలింగముగారు చెన్నపురి వెళ్లి పోయిరి. ఆయన బయలుదేఱుటకు మునుపు, ఇంటియొద్ద వారిని జూచితిని. సంస్కరణాంశములం దాయన నామనసునకు నచ్చినట్టి అతివాదియె. కాని, యాయనలోపము లెంత బయలుపడియున్నవి ! అహంభావము, ఆత్మశ్లాఘనమును వీరి వాక్కులయందుఁ జూచి నేను జింతించి, ఈశ్వరకృపచే నివి తొలఁగవలె నని కాంక్షించితిని. ఆస్తికపాఠశాలస్థాపన విషయమై పాపయ్యగారు పరిపూర్ణసానుభూతిఁ జూపుచుండువారు. ఇపుడు నాకు మాతమ్ముఁడు వెంకటరామయ్యయు, మృత్యుంజయ రావును నిత్యసహచరు లయిరి. నవీనముగా స్నేహము గలసినను, మృత్యుంజయరావునెడల నాకు చన వెక్కువ. మితభాషి యైనను, మనసుగలసినమిత్రులతోఁ దన యాదర్శములను విశ్వాసములను ఆతఁడు వెల్లడించుటకు వెనుదీయకుండువాఁడు. భవిష్యత్తునందలి మాకార్య ప్రణాళికనుగుఱించి ముచ్చటించుచుండువారము. మిల్లు వ్రాసిన "స్త్రీ నిర్బంధము" అనుపుస్తకమును అమితతమకమునఁ జదివితిమి. జన లోకముయొక్క కనులువిప్పి, ఉత్కృష్టసాంఘిక సమస్యలను నిర్భయముగ నెదుర్కొనిన యాయుత్తమరచయితవాక్కులు విని నామిత్రుఁడు హర్షోద్రేకమున మిన్ను ముట్టుచుండువాఁడు. ఈమిత్రుఁడు వక్తయు