పుట:2015.373190.Athma-Charitramu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

39. స్నేహభాగ్యము 173

వ్రాయసకాఁడును కాఁడు. సఖులతోడి సుఖసంభాషణములందు మాత్రము, ఆతనికంటె నధికమగు బుద్ధివైశద్యము సదుద్దేశసద్భావములును గనఁబఱచెడివా రరుదుగ నుందురు ! అతనికి స్త్రీవిద్యాభిమానము మెండు. అందఱివలె మాటలతోఁ దనివి నొందక, తనభార్య మాణిక్యాంబ కాతఁడు విద్యాసౌకర్యము లెన్నియో కలిగించెను. ఇపుడు నాప్రోత్సాహమున నతఁడు "పండిత రామాబాయిసరస్వతి"ని గుఱించి వ్యాసము వ్రాయఁగా, అది జూన్‌పత్రికలోఁ బ్రచురించితిమి.

రాజమంద్రినివాస మనిన నే నంత విసు వంది, ఏప్రిలుపత్రిక తపాలో నంపినవెంటనే, వేలివెన్ను, నర్సాపురము మున్నగుప్రదేశములు తిరిగి వచ్చితిని. ఈ సెలవులలో వీరేశలింగముపంతులు కనకరాజును పట్టణమున లేనందున, మే, జూను పత్రికలలోఁ బ్రచురింప వలసినవ్యాసములు నేనే నిర్ణయించితిని. ప్రాఁతవ్యాసములలో "అహం బ్రహ్మాస్మి" అను నద్వైతమతఖండనము నాకనుల కగపడెను. అది కనకరాజు వ్రాసినది. వేదాంతవిషయములలో మాకు పంతులుగారి తరువాత కనకరాజే ప్రమాణము ! అద్వైతము బ్రాహ్మమతమునకుఁ బరమశత్రు వని యాతనిమతము. ఇపు డీవ్యాసము గాటుగ నుండుట చేత, మేనెల పత్రికలో దానినిఁ బ్రచురించి, దేశోద్ధరణము గావించితి మని సంతసించితిమి. తప్పులతడకగ నుండిన యీ యసంపూర్ణ వ్యాసము తనకుఁ జెప్పక యేల ప్రచురించితి రని పిమ్మట కనకరాజు కోపపడెను. ఆతఁ డనుకొనినట్టుగనే, బళ్లారి "సన్మార్గబోధినీ" పత్రికలో నీవ్యాసముమీఁద పెద్దఖండనము ప్రచుర మయ్యెను. వేసవి సెలవు లయినపిమ్మట, ఈఖండనమునకుఁ బ్రత్యుత్తరము లిచ్చితిమి.

మరల కళాశాల తీసినవెనుక మృత్యుంజయరావుని యాలోచన ననుసరించి, ప్రార్థనసమాజసభ్యులము కొందఱము, ఇతరవిద్యా