పుట:2015.373190.Athma-Charitramu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38. సంరంభము 165

వయోవ్యత్యాస మెక్కువగఁ గలిగి, ఆగ్రహ మితభాషిత్వములతో నొప్పెడి వీరేశలింగముపంతులుగారి నెన్నఁడునుగాని మేము వేయ వెఱగండెడిప్రశ్నములకు, సమవయస్కులగు నాయఁడుగారు సౌమ్య భావమున సదుత్తరము లిచ్చు చుండువారు. యువజనహృదయాకర్షము చేయుసమర్థతయు, వారలను సన్మార్గమునకుఁ బురిగొల్పెడి సౌజన్యమును, వారియందుఁ గలవు. కావున నేను గనులనుగుఱించి చెన్నపురికిఁ గట్టినపయనము వ్యర్థ మని యెంచక, అంతర్చక్షువికసనమున కిది సందర్భ మయ్యెనని మిగుల సంతసించితిని.

చెన్నపురియందు నే నుండు దినములలోనే యచటి బ్రాహ్మసమాజవర్ధంతి జరిగెను. ఆసందర్భమున నాయఁడుగా రొక యుపన్యాసము చేసిరి. ఆయుత్సవానంతరమున, 1892 జనవరి 4 వ తేదీ సోమవారమున చెన్నపురినుండి నే నింటికి బయలుదేఱితిని.

38. సంరంభము

ఆకాలమున చెన్నపురి నుండి యుత్తరాంధ్రమండలములకు రెయిలుపయనము చేయువారు మిగుల మెల్లగను, మిక్కిలి చుట్టు మార్గమునను పోవలసివచ్చెను. మద్రాసు నుండి గుంతకల్లువఱకును మెయిలులో నొకరాత్రి; గుంతకల్లునుండి కంభమువఱకు నొకపగలంతయు; అంత, కంభము చలిలో నిర్బంధ విశ్రమము రాత్రియంతయు; కంభమునుండి బెజవాడకు మఱునాఁటి యుదయమునుండి సాయంకాలము వఱకును. నేను పయనము చేయుబండిలో నదృష్టవశమున మద్రాసునుండి బెజవాడవఱకును ఇంజనీరింగ్ కాలేజివిద్యార్థు లుండిరి. వారిలో నా పూర్వసహపాఠి రంగనాయకులుగారుండుటవలన నాకుఁ గాలక్షేపము సుకర మయ్యెను. బెజవాడలో నే నెక్కినపడవలోనే