పుట:2015.373190.Athma-Charitramu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 164

అనర్గళవచోవిభవమునకును, చెన్నపురియం దీయన మంచి కీర్తి గడించెను. నీతిమతవిషయములం దసమానమగు ప్రజ్ఞయు పట్టుదలయు వీరికిఁ గలవు. ఇట్టికీర్తిప్రతిభలతో నొప్పెడివారికి నిరువదియైదువత్సరములలేఁ బ్రాయముననే పత్నీ వియోగము సంభవించెను. ఒక కొమార్తెమాత్రము గలదు. ఎంద రెంతఁగ బోధించినను, పునర్వివాహము చేసికొనలేదు. బంగారమునకు వెలిగారమువలె, ఈమహాశయుని సచ్చారిత్రమునకును మతాభినివేశమునకును, ఆయనవైరాగ్యబుద్ధియు బ్రహ్మచర్యనిష్ఠయు మఱింత వన్నె గొనివచ్చెను.

నే నీసమయమున నిట్టి సచ్ఛీలుఁడగు బ్రాహ్మధర్మవిశ్వాసుని సావాసమునే మిక్కిలి కాంక్షించుచుంటిని. వీరేశలింగముపంతులు లౌకికవిద్యయందువలె పారమార్థికవిషయములందును నా గురూత్తములే. ఐనను, వారిప్రజ్ఞానైపుణ్యములు సంఘసంస్కరణరంగముననే ముఖ్యముగ ప్రదర్శితము లగుచుండెను. ఆయనకుఁ బ్రియమగు మతము బ్రాహ్మధర్మమే. బ్రాహ్మసమాజాదర్శములు వారికిఁ గొట్టినపిండియే. కాని, యింగ్లీషువిద్యయే పరమావధి యైన యాకాలపువిద్యాధికులకు, ఆవిద్యలో నున్నతస్థాన మలంకరించిన నాయఁడుగారివంటివారు చేసెడి ధర్మప్రసంగములే మతవిషయములందు పరమప్రమాణములు. నేను జదువవలసినగ్రంథములు, జరుపవలసిన విధానములనుగూర్చిన యనేకవిషయములు నేను వారివలన గ్రహించితిని.

నాకంటె నాయఁడుగారు 6, 7 సంవత్సరములు మాత్రమే పెద్దలు. నామనస్సునఁ దోఁచిన పలుసందియముల నాయన సోదరభావమునఁ దీర్చుచుండువారు. ఇంతియ కాదు. బ్రాహ్మధర్మమున కాయువుపట్టగు ప్రేమగుణము వారియందు మూర్తీభవించినటు లుండెను !