పుట:2015.373190.Athma-Charitramu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

31. రచనావ్యాసంగము 137

టికిఁ బోవుచుండువాఁడను. ఆపత్రికలోఁ బ్రచురమగు మంచివ్యాసముల నిపుడు ఆంధ్రీకరింపసాగితిని. కడచిన రెండుసంవత్సరముల నుండియు రాజమంద్రిలో ప్రచుర మగు "వివేక వర్ధనీ" వారపత్రికను దెప్పించి సంతోషమునఁ జదువుచుండువాఁడను. ఇపుడు కొలఁది కాలమునుండి యాపత్రిక పడిపోయెను. మా చేతులలోనే యిట్టి వార్తాపత్రిక యొకటి యుండినచో, నే నిటీవల వ్రాయుచువచ్చిన పద్యములు వ్యాసములు నందుఁ బ్రచురింపవచ్చునుగదా ! నావలెనే ప్రార్థన సమాజమిత్రులును వ్రాసెడి వ్యాసములు, సభలలోఁ జదివెడి యుపన్యాసములును, ఇట్టి వార్తాపత్రికలలో ముద్రింపవచ్చును.

వార్తాపత్రికా స్థాపనమును గుఱించి నే నంతట కొందఱు సమాజమిత్రులతోఁ బ్రస్తావించితిని. వారు దాని నామోదించిరి. మే 27 వ తేదీని మృత్యుంజయరావు నేనును వీరేశలింగముగారితో మాటాడి, గోదావరియొడ్డున షికారుపోవుచు, పత్రికాస్థాపనమును గుఱించి మాటాడుకొంటిమి. మిత్రునితో నే నిట్లు చెప్పితిని : - "వీరేశలింగముపంతులుగారు తాము విరమించిన వివేకవర్థనీ స్థానమున చింతామణి యను మాసపత్రికను నెలకొల్పఁ దలఁచుకొన్నారు. మనబోటివారు వ్రాయు వ్యాసము లందుఁ బ్రచురింపరు. బొంబాయి బంగాళాదేశములలోని ప్రార్థన సమాజములకు స్వంత వార్తాపత్రిక లున్నవి. మనకుఁగూడ నొక పత్రిక యుండుట కర్తవ్యము. ముందుగా నొక చిన్నపత్రిక నేర్పఱిచి, దానిని క్రమముగఁ బెంపు చేయవచ్చును. ప్రార్థనసమాజమే దీని యాజమాన్యము వహింపవలెను. ఈ పట్టణమున నుండు సభ్యులు కార్య నిర్వాహక సంఘముగ నేర్పడి పత్రికను సాగింపవచ్చును." మృత్యుంజయరావు నాతో నేకీభవించెను. అంత మే మిరువురము పత్రికను గుఱించి మాటాడుకొని, చందాలు పోగు